అధికారంలోకి వస్తే.. నా ఫోటో పెట్టుకునేలా చేస్తా : జగన్

నెల్లూరు : వైఎస్ ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని చంద్రబాబు కావాలనే నీరు గారుస్తున్నారని ఆరోపించారు జగన్. నెల్లూరులో జరిగిన యువభేరిలో విద్యార్థును ఉద్దేశించి మాట్లాడిన జగన్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ లాంటి వైఎస్ పథకాలన్నింటిని నిక్కచ్చిగా అమలు చేస్తామని, ఏపీ ప్రజలంతా తన ఫోటో పెట్టుకునేలా చేస్తానని ప్రకటించారు.

ఏ టీవీ చూసినా.. ఏ గోడ రాతలు చూసినా..

ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చేసిన హామిలన్నీ ఏమయ్యాయని నిలదీసిన జగన్.. ఏ టీవీ చూసినా.. ఏ గోడ రాతలు చూసినా.. మీటింగుల్లో మాట్లాడినా.. జాబు కావాలంటే బాబు సీఎం కావాలని ప్రచారం ఊదరగొట్టారని.. తీరా బాబు సీఎం అయినా జాబులు వచ్చే పరిస్థితి లేదన్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి లక్షా 42వేల పోస్టులు ఖాళీ ఉన్నాయనని లెక్కలు గట్టిన టీడీపీప్రభుత్వం.. ఖాళీలను భర్తీ చేయడంలోను విఫలమైందని, ఆఖరికి నిరుద్యోగ భ్రుతి కింద చెల్లిస్తామని చెప్పిన 2వేలకు కూడా దిక్కు లేదన్నారు.

గ్రామీణ విద్యార్థులంతా అప్పులు చేసి మరీ నెలల తరబడి ఏపీపీఎస్సీ కోసం సమాయత్తమవుతుంటే.. ప్రభుత్వం ఇప్పటికీ పరీక్షలు నిర్వహించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు జగన్. అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీని మాత్రమే నిర్వహించిన ప్రభుత్వం.. ఆఖరికి మెరిట్ లిస్టును మాత్రం విడుదల చేయకుండా అభ్యర్థులకు ఎదురుచూపులే మిగిల్చిందన్నారు.

హోదాను నీరు గారుస్తున్నారు

ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి తెలిసి కూడా చంద్రబాబు హోదాను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్. పార్లమెంట్ సాక్షిగా విభజన హామిలకు ఒప్పుకున్న బీజేపీ ఇప్పుడదే పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇవ్వమని చెబుతోన్న చంద్రబాబు మాత్రం కేంద్రాన్ని నిలదీయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు.

ఆనాడు ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన వెంకయ్య, చంద్రబాబు లాంటి నేతలు ఇప్పుడు మాత్రం హోదాను నీరు గార్చేందుకే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోను పదేళ్ల హోదా సాధిస్తాం అంటూ ప్రతీ మీటింగులో ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాత్రం కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్నారన్నారు.

చంద్రబాబు ఎందుకు నిలదీయలేకపోతున్నారంటే..

తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీలను కొనడానికి నల్లధనంతో బేరసారాలు జరిపిన చంద్రబాబు.. కేసులో ఆడియో టేపులతో అడ్డంగా దొరకిపోవడంతో మోడీ వద్ద నోరు మెదపలేకపోతున్నారని ఆరోపించారు.

ఓటుకు నోటుతో పాటు.. రాష్ట్రంలో అడ్డగోలు కరషప్షన్ చార్జీల్లో ఇరుక్కున్న చంద్రబాబుకు మోడీ నిలదీసే ధైర్యం లేదని, ఒకవేళ నిలదీసే ప్రయత్నం చేస్తే.. మోడీ ఎక్కడ సీబీఐని రంగంలోకి దించుతారన్నది చంద్రబాబు భయం అని అన్నారు జగన్. అవినీతి భయంతో చంద్రబాబు ప్రశ్నించకపోవడంతోనే మోడీ హోదా విషయాన్ని పక్కనబెట్టేశారని ఆరోపించారు.

Jagan interesting comments in nellore yubabheri regarding special status

చిత్తశుద్ది ఉంటే మిత్రపక్షం నుంచి తప్పుకోండి

సీఎం చంద్రబాబుకు గనుక నిజంగా చిత్తశుద్ది ఉంటే కేంద్రానికి ఓ అల్టీమేటం జారీ చేసి హోదా ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటామని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. హోదాపై చంద్రబాబు మాట మార్చిన తీరును ప్రస్తావించిన జగన్.. హోదా వస్తే అన్నీ జరిగిపోతాయా.. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా.. అని పలు సందర్బాల్లో చంద్రబాబు వెటకారంతో కూడిన వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబుకు అడిగే ధైర్యం లేదు కాబట్టే మోడీకి వెంకయ్యకు ధైర్యం పెరిగిపోయి హోదా ఇచ్చేది లేదంటున్నారని అసంత్రుప్తి వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనమేంటి?

హోదా ఇవ్వకుండా ఉండడం కోసం కారణాలు వెతుకుతున్న మీకు.. హోదా వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా.. అంటూ టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్.. హోదా వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.

హోదా వస్తే రెండు ప్రయోజనాలు కలుగుతాయని.. హోదా వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంట్ లభిస్తుందని, కాబట్టి కేంద్రం ఇచ్చే నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు జగన్. ఇక మరో ప్రయోజనం గురించి చెబుతూ.. పరిశ్రమలకు 100 శాతం ఇన్ కమ్ టాక్స్ ఫ్రీ వెసులుబాటు లభిస్తుందని.. ఎక్సైజ్ డ్యూటీ కూడా ఉండదని, పరిశ్రమలకు 50శాతం కరెంట్ సబ్సిడీతో పాటు ఉత్పత్తులపై ట్రాన్స్ పోర్టు ఛార్జీలను కూడా చెల్లించే అవకాశం ఏర్పడుతుందన్నారు.

హోదా వస్తే ఎక్కడికి తిరగాల్సిన పనిలేదు

హోదా వస్తే.. చంద్రబాబు నాయుడు మాదిరి చైనా జపాన్ సింగపూర్ రష్యా ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్న జగన్.. హోదా వస్తే పరిశ్రమలన్నీ రాష్ట్రానికి క్యూ కడుతాయన్నారు. పక్క రాష్ట్రం వాళ్లు, విదేశీయులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారని.. తద్వారా లక్షల కోట్లు పెట్టుబడితో పాటు వేల సంఖ్యలో పరిశ్రమలు.. ఉద్యోగాలు వస్తాయన్నారు.

హోదా ఇచ్చిన రోజు రాష్ట్రంలో 'నో వేకెన్సీ' బోర్డులు కనిపించవని.. వాంటెడ్ బోర్డులు దర్శనమిస్తాయని తెలిపారు జగన్. హోదా వల్ల ప్రతీ జిల్లా ఓ హైదరాబాద్ నగరంగా మారుతుందన్నారు. పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ మాట్లాడిన తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారని.. కనీసం అప్పుడైనా పౌరుషంతో కేంద్రాన్ని నిలదీస్తారని ఆశించామని, కానీ అందుకు విరుద్దంగా హోదా ఇవ్వకపోయినా కేంద్రంలో కొనసాగుతామని ప్రకటించడం దారుణమన్నారు జగన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+