ఆ వివరాలు బాబుకు ఎలా తెలిశాయి?, విచారణ చేపట్టాలంటూ మోడీకి జగన్ లేఖ
హైదరాబాద్ : దేశంలో నల్లధనం ద్వారా భారీ ఆదాయాన్ని కలిగి ఉన్నవారు తమ ఆదాయ వివరాలను వెల్లడిస్తే.. ఆయా వ్యక్తుల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రాంతం నుంచి ఓ వ్యక్తి రూ.10వేల కోట్ల నల్లధనం వివరాలు వెల్లడించారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు కూడా పలు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వ్యవహారంపై ప్రతిపక్ష అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నల్లధనంపై చేసిన పలు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐడీఎస్(ఇన్ కమ్ టాక్స్ డిక్లరేషన్ స్కీమ్)-2016పై జరిగిన పరిణామాలను ప్రధానికి వివరిస్తూ లేఖలో పలు అంశాలు పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.
అయితే ఈ విషయంపై కొంతమంది నేతలు కామెంట్ చేస్తుండడాన్ని ప్రస్తావిస్తూ.. నల్లధనం ఆదాయాన్ని వెల్లడించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)చెప్పగా.. సీఎం చంద్రబాబుకు ఆ వివరాలు ఎలా తెలిశాయని ప్రశ్నిస్తున్నారు జగన్. సీబీడీటీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రెండు సందర్భాల్లో ఇదే అంశంపై పలు వ్యాఖ్యలు చేశారని జగన్ పేర్కొన్నారు.

ఓ వ్యక్తి 10వేల కోట్ల నల్లధనం ఆదాయ వివరాలు వెల్లడిస్తే.. అతని గురించి చంద్రబాబుకు ఎలా తెలిసిందని ప్రశ్నించిన జగన్.. బహుశా 10 వేల కోట్ల నల్లధనం కలిగి ఉన్న వ్యక్తికి చంద్రబాబు బినామీ కావచ్చునేమోనని ఆరోపించారు. అంత ఖచ్చితంగా 10వేల కోట్లేనని చంద్రబాబు ఎలా చెబుతున్నారనేది జగన్ లేవనెత్తుతోన్న ప్రశ్న.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అవినీతి పాలనలో చంద్రబాబు ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందన్నారు జగన్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు దాదాపు లక్షన్నర కోట్ల కుంభకోణానికి చంద్రబాబు ఎలా పాల్పడ్డారనే దానిపై ఓ పుస్తకం కూడా వచ్చినట్లుగా లేఖలో జగన్ పేర్కొనట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేస్తోన్న అవినీతిపై విచారణకు ఆదేశించేందుకు గాను అవసరమైన సమాచారమంతా ఆ పుస్తకంలో ఉందని, అయినా.. ఇంతవరకు చంద్రబాబుపై ఎలాంటి విచారణ జరగలేదని అన్నారు.
ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయినా.. ఇంకా సీఎం హోదాలోనే కొనసాగుతున్నారని చంద్రబాబును దుయ్యబట్టారు జగన్. తనపై విచారణ జరిపించే వ్యక్తి ఈ దేశంలోనే లేరని చంద్రబాబు భావిస్తున్నారని ఈ సందర్బంగా చెప్పారు. ఇకపోతే ఐడీఎస్ లో ఆదాయాన్ని ప్రకటించిన వారి పేర్లు బహిర్గతం చేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లుగా లేఖలో జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపై కూడా విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు.












Click it and Unblock the Notifications