అటకెక్కిన నంది అవార్డులు- చంద్రబాబు ప్రకటించినవీ...నోరు మెదపని టాలీవుడ్
ఏపీలో తెలుగు సినిమా, టెలివిజన్ రంగాలను ప్రోత్సహించేందుకు ఇచ్చే నందీ అవార్డుల భవితవ్యం ప్రమాదంలో పడింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ నందీ అవార్డుల ఊసెత్తకపోగా.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను సైతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదు. దీంతో ఇకపై నందీ అవార్డులు ఇవ్వడం కష్టమేనని తేలిపోతోంది. దీనిపై నిత్యం జగన్ తో టచ్ లో ఉండే టాలీవుడ్ పెద్దలు కూడా నోరు మెదపడం లేదు.

నందీ అవార్డులు ఇచ్చేదెప్పుడో ?
తెలుగు సినిమా, టీవీ కళాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏటా ఇచ్చే నందీ అవార్డుల్ని అందుకోవడాన్ని కళాకారులు, దర్శక నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే ఐదేళ్లుగా నందీ అవార్డుల ప్రదానోత్సం ఊసేలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న రోజుల్లో అటు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం, ఇటు సమైక్యాధ్ర ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగేవారు. దీంతో నందీ అవార్డుల ప్రకటనను తొలిసారిగా పక్కనబెట్టారు. ఈ వివాదాలతో సినిమా రంగానికి చెందినవారు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపధ్యంలో నాటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ నంది అవార్డుల పై దృష్టిపెట్టలేకపోయింది. ఉమ్మడి ఏపీలో 2012, 2013 సంవత్సరాలకు నందీ అవార్డుల ఎంపిక చేయలేదు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు ప్రభుత్వం నందీ అవార్డులు ప్రకటించింది. అయినా వాటికి ఇప్పటికీ మోక్షం కలగలేదు.

చంద్రబాబు హయాంలో
చంద్రబాబు ప్రభుత్వం 2014,2015,2016 సంవత్సాలకు సబంధించిన నందీ అవార్డులను ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించారు. రాష్ట్ర విభజనతో ఆగిపోయిన 2012,2013 సంవత్సరాల నందీ అవార్డులను కూడా ఇవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ ఐదేళ్లకు సినిమా, టివి నందీ అవార్డు విజేతల ఎంపిక కూడా జరిగింది. ప్రతిష్టాత్మకంగా ఐదు సంవత్సరాల నందీ అవార్డుల ప్రధానోత్సవాన్ని జరపాలని చంద్రబాబు భావించారు. అయితే రాజకీయాల్లో, పాలనలో, అమరావతి నిర్మాణంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నందీ అవార్డుల ప్రధానం కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో అవార్డుల ప్రదానం నిలిచిపోయింది.

నందీ అవార్డుల్ని పట్టించుకోని జగన్
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐదేళ్లకు నందీ పురస్కారాలను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించినా అది సాధ్యం కాకపోవడంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సీఎం జగన్ ఓవైపు టాలీవుడ్ కు అండగా నిలుస్తానని చెబుతూనే అవార్డుల వ్యవహారాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు. ఇప్పుడు జగన్ కు సలహాదారుగా ఉన్న జీవీడీ కృష్ణమోహన్ తాజాగా మాట్లాడుతూ.. ఇప్పుడు నందీ అవార్డులు ఇస్తే పాత బకాయిలు చెల్లించినట్లు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో నందీ పురస్కారాలపై వైసీపీ ప్రభుత్వానికి ఆసక్తి లేదని తేలిపోయింది.

నోరు మెదపని టాలీవుడ్ పెద్దలు
తెలుగు చిత్ర పరిశ్రమకు, టీవీ రంగానికి దశాబ్దాలుగా ఇస్తున్న నందీ అవార్డుల ప్రకటన తర్వాత కూడా ప్రభుత్వాలు వాటిని ప్రదానం చేయకుండా మూలనపడేసినా టాలీవుడ్ మాత్రం నోరు మెదపడం లేదు. తమ కొత్త సినిమాలకు అదనపు షోల కోసం, కరోనాలో షూటింగ్ లు, థియేటర్లు తెరిచేందుకు అనుమతుల కోసం జగన్ చుట్టూ తిరిగిన టాలీవుడ్ పెద్దలు చిరంజీవి, నాగార్జున వంటి వారు కూడా నందీ అవార్డులపై నోరు మెదపలేదు. దీంతో టాలీవుడ్ కు అవసరం లేని అవార్డులు తాము మాత్రం ఎందుకు పట్టించుకోవాలన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం కూడా వాటిని అటకెక్కించేసింది.












Click it and Unblock the Notifications