జగన్! బాబును చూసి నేర్చుకో, లేదంటే అంతే: సొంత పార్టీ నేతల షాక్
Recommended Video

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పోల్చితే నాయకత్వ పరంగా జగన్ వెనకబడే ఉన్నారని వారంటున్నారు. బాబు నుంచి మెళకువళు, ఎన్నికల వ్యూహాలు జగన్ నేర్చుకోవాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

అందుకే ప్రశాంత్ కిషోర్..
అంతేగాక, పార్టీ నిర్మాణంపై జగన్మోహన్ రెడ్డికి అంతగా పట్టురాలేదని వారంటున్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించడంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సఫలీకృతులు కాలేకపోతున్నారని సొంత పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం. అందువల్లే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంటున్నారు.

ప్రజల్లోకి పార్టీ..
పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ప్రశాంత్ కిషోర్ దృష్టి సారించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. ఇందులో భాగంగానే ‘వైయస్సార్ కుటుంబం' క్యాంపెయిన్ జరుగుతోందని వివరించారు. ఒక మిస్డ్ కాల్ చేయడం ద్వారా ఎవరైనా ఈ కుటుంబంలో చేరిపోవచ్చు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఈ పద్ధతిని ఎంచుకోవడం గమనార్హం.

అలా ముందుకెళ్తేనే..
‘ప్రస్తుతం ఓటర్లందరూ సానుభూతితో ఉన్నారు. నాయకుడు(జగన్) ప్రాక్టికల్‌గా ఆలోచించి ముందుకు నడవాలి. తెలుగుదేశం పార్టీ తన కార్యక్రమాలను ఎలా చక్కదిద్దుకుంటుందో చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది' అని వైసీపీ ప్లీనరీ, టీడీపీ మహానాడులను ఉద్దేశించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, మాజీ మంత్రి అన్నారు.

వెనక్కి తగ్గని చంద్రబాబు
తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనుకున్న టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎలా నిలబెట్టుకున్నారో.. జగన్ గమనించాల్సిన అవసరం ఉందని మరో వైసీపీ నేత అన్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదురైనప్పటికీ తెలంగాణలో టీడీపీని చంద్రబాబు కాపాడుకోగలిగారని చెప్పారు. టీడీపీకి చెందిన కీలక నేతలు పార్టీకి దూరమైనప్పటికీ పార్టీని తన వ్యవహారశైలితో టీడీపీని నిలదొక్కుకునేలా చేశారని వ్యాఖ్యానించారు.

జగన్ వ్యూహాలు మార్చాల్సిందే.. లేదంటే..
ఇది ఇలావుంటే.. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు వ్యూహాల ముందు జగన్ నిలువలేకపోయారని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ వైఖరిలో మార్పు రాకుంటే వైసీపీ మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని వారంటున్నారు. మరి జగన్ ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని.. టీడీపీకి ఎదురు నిలుస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications