కొత్త జిల్లాలతో ఖజానా నింపే ప్లాన్-11 జిల్లా కేంద్రాల్లో భూముల విలువ పెంపు-గరిష్టంగా 75 శాతం
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ఖజానా నింపుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం జిల్లాలు అమల్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లా కేంద్రాల్లో భూముల మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి. ఈ పెంపుకూడా గరిష్టంగా 75 శాతం వరకూ ఉంది. దీంతో ఏటా ఆగస్టులో చేసే పెంపుకు ఈ ప్రత్యేక సవరణ అదనంగా మారబోతోంది.

కొత్త జిల్లాల్లో కొత్త బాదుడు
ఏపీలో గతంలో ఉన్న 13 జిల్లాల స్ధానంలో తాజాగా 26 కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. జిల్లాల సంఖ్య పెంపుకు ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్లు లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసింది. అయితే దీని వెనుక ఆదాయం పెంచుకునే ఎత్తుగడలే ఉన్నాయన్న సత్యం క్రమంగా అర్దమవుతోంది. ఇందులో భాగంగా కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే భూముల మార్కెట్ విలువలు పెంచుతూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

11 జిల్లా కేంద్రాల్లో బాదుడు
రాష్ట్రంలోని 11 కొత్త జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరిగిన భూముల మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చేశాయి. ప్రత్యేక సవరణ పేరుతో ప్రభుత్వం ఈ మేరకు భూముల మార్కెట్ విలువలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లా కేంద్రాల్లో స్ధానికంగా ఉన్న డిమాండ్ మేరకు 18 శాతం నుంచి 75 శాతం వరకూ భూముల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు పన్నుల రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం సమకూరనుండగా.. జనం జేబులకు చిల్లు పడటం ఖాయం.

జిల్లా కేంద్రాల్లో పెంపు ఇలా
11 కొత్త జిల్లా కేంద్రాల్లో భూముల మార్కెట్ విలువల్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో తిరుపతిలో అయితే అత్యధికంగా 75 శాతం పెరిగాయి. జిల్లా పరంగా చూస్తే నాలుగు సబ్ రిజిస్టార్ కార్యాలయాల పరిధిలో 18 శాతం నుంచి 75 శాతం విలువ పెంచారు. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో పెదపులిపాకలో మార్కెట్ విలువ 37 శాతం పెంచారు. కానూరులో అయితే 25 శాతం పెరిగింది. బందరు రోడ్డుకు ఇరువైపులా గజం రూ.96400 ఉండగా.. దాన్ని కాస్తా లక్షా 10 వేలకు పెంచారు. ఇలాగే కొవ్వూరు, రాజమండ్రి, భీమవరం, అనకాపల్లి, పార్వతీపురంతో పాటు పలు చోట్ల భూముల మార్కెట్ విలువలు స్ధానిక పరిస్ధితుల ఆధారంగా పెంచేసారు. దీంతో ఆయా చోట్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరబోతోంది.












Click it and Unblock the Notifications