ఏపీ ఎక్సైజ్ పాలసీ మరో ఏడాది పొడిగింపు-ఇక డిజిటల్ పేమెంట్స్-నిషేధం ఊసులేకుండానే..
ఏపీలో మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ వచ్చే ఏడాది కూడా దాని ఊసెత్తకుండానే ప్రస్తుత విధానాన్ని కొనసాగించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానంపైనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. దీన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ తో పాటు జీవో కూడా జారీచేసింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వ ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా దీన్ని పొడిగించినట్లు అర్ధమవుతోంది.

ఎక్సైజ్ పాలసీ పొడిగింపు
ఏపీలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సైజ్ విధానానికి మరోసారి పొడిగింపు లభించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్సైజ్ విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అనంతరం ఖరారు చేసిన ఎక్సైజ్ పాలసీ ప్రస్తుతం అమలవుతోంది. దీన్ని మరో ఏడాది పాటు యథాతథంగా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు రిటైల్ మద్యం అమ్మకాలను అనుమతిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

రిటైల్ మద్యం అమ్మకాలు ఇలా
2022-23 సంవత్సరానికి రిటైల్ మద్యం విక్రయాల విధానం అమలుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2934 రిటైల్ మద్యం దుకాణాల్లో భారత్ లో తయారైన విదేశీ మద్యం, విదేశీ మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. 2022 అక్టోబర్ 1 తేదీ నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకూ మద్యం విధానం అమల్లో ఉంటుదని సర్కార్ స్పష్టం చేసింది. ఈ విధానంలో భాగంగా నిర్దేశిత రిటైల్ అవుట్ లెట్ ల సంఖ్య కు మించకుండా వాక్ ఇన్ స్టోర్ లను ఏర్పాటు చేసేందుకు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కు అనుమతి ఇచ్చింది.
మద్యం వాక్ ఇన్ స్టోర్ లు, రిటైల్ అవుట్ లెట్ లను ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. జాతీయ రహదారుల వెంబడి మద్యం విక్రయాల పై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు అవుతాయని స్పష్టం చేసింది.

డిజిటల్ పేమెంట్స్ కు గ్రీన్ సిగ్నల్
రిటైల్ అవుట్ లెట్లలో ఇక నుంచి డిజిటల్ చెల్లింపుల కు అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మద్యం విధానంలో భాగంగా మద్య నియంత్రణ,బెల్ట్ దుకాణాల తొలగింపు తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిరుమల కు దారి తీసే అలిపిరి మార్గం లో ఎలాంటి మద్యం దుకాణాలకు అనుమతి లేదని జీవో లో ప్రభుత్వం పేర్కొంది.
రిటైల్ అవుట్ లెట్లలో జరిగే మద్యం విక్రయాలను ట్రాక్ అండ్ ట్రేస్ విధానం లో పర్యవేక్షణ చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర , అనివార్య పరిస్థితుల్లో రిటైల్ దుకాణం మరో చోటికి తరలించేందుకు ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీకి అధికారాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications