పవన్ కళ్యాణ్ మరో ప్రశ్నకు జగన్ సర్కార్ క్లారిటీ..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి యాత్ర చేపట్టారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో వారాహియాత్ర పూర్తి చేసుకున్న పవన్.. తాజాగా ఏలూరు జిల్లాలో యాత్ర కొనసాగిస్తున్నారు.ఇందులో ఆయన చేస్తున్న విమర్శలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ వాటికి క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా పవన్ వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న డేటా ఆధారంగా రాష్ట్రంలో మహిళల కిడ్నాప్ లు జరుగుతున్నాయంటూ చేసిన విమర్శలపై మహిళా కమిషన్ స్పందించింది. పవన్ చెప్పినట్లు రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యం కాలేదని, కేవలం 1400 మంది మాత్రమే అదృశ్యమయ్యారని క్లారిటీ ఇచ్చింది. దీంతో పవన్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై గొంతు సవరించుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు పవన్ చేసిన మరో విమర్శలపై ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

ఏపీలోని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు అమలు చేయడం లేదని పవన్ కళ్యాణ్ తాజాగా ప్రశ్నించారు. అక్రమాల కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు. దీనిపై ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ వర్గాలు స్పందించాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయని బెవరేజెస్ కార్పొరేషన్ తెలిపింది. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు జరగడం లేదని ఇటీవల జనసేన ఆరోపించడంతో క్లారిటీ ఇచ్చింది.
అలాగే కొన్ని లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేటీఎం. ద్వారా, మరికొన్ని దుకాణాల్లో ఎస్.బి.ఐ ఈజీ ట్యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, నగదు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నట్లు బేజరేజెస్ కార్పోరేషన్ వివరించింది. తద్వారా నగదు, డిజిటల్ రెండు చెల్లింపుల్ని మద్యం దుకాణాల్లో అనుమతిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. వాస్తవ పరిస్దితి చూస్తే రాష్ట్రంలో పూర్తి స్ధాయిలో డిజిటల్ చెల్లింపులు జరగడం లేదనేది విపక్షాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications