KR Suryanarayana : ఉద్యోగ నేత కేఆర్ సూర్యనారాయణకు జగన్ సర్కార్ మరో షోకాజ్ నోటీసు..
ఏపీలో ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు ప్రభుత్వం మరో షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతంలో ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడంపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేసిన ప్రభుత్వం.. ఆయన నేతృత్వం వహిస్తున్న సంఘం గుర్తింపు రద్దు చేసే వరకూ వెళ్లింది. అయితే హైకోర్టు జోక్యంతో ఇది కాస్తా నిలిచిపోయింది. ఇప్పుడు మరో వ్యవహారంలో కేఆర్ సూర్యనారాయణకు ప్రభుత్వం నోటీసులు పంపింది.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణ.. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖలో చేపట్టిన బదిలీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేఆర్ సూర్యనారాయణ.. గతంలో ధర్నాకు దిగారు. వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ కార్యాలయం ఎదురుగా నిరసనకు దిగిన సూర్యనారాయణ.. బదిలీలపై అభ్యంతరం తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఆయనకు షోకాజ్ పంపింది.

వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగడమే కాకుండా, ఉన్నతాధికారిని దిగ్బంధించడంపై ప్రభుత్వం సూర్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ తాజాగా కేఆర్ సూర్యనారాయణకు నోటీసులు పంపింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడిన కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసుల్లో ప్రభుత్వం పేర్కొంది.

గతంలో గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన కేఆర్ సూర్యనారాయణను ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగులతో జరిపిన చర్చలకు ఆహ్వానించలేదు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన సూర్యనారాయణ తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వం మరింత ఆగ్రహంగా ఉంది. అదే సమయంలో సూర్యనారాయణ చర్యలు ప్రభుత్వానికి వరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజా నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications