మూడు రాజధానులపై జగన్ సర్కార్ తాజా వ్యూహమిదే ? ద్విముఖ పోరుకు రెడీ-ఏడాదిలో తేల్చేలా!
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్నిఅమల్లోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో రెండుసార్లు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయితే ఈ బిల్లులు న్యాయసమీక్షకు నిలబడకపోవడంతో వాటిని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత హైకోర్టు అమరావతే రాజధాని అంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయని ప్రభుత్వం.. అసెంబ్లీలోనూ మరోసారి మూడు రాజధానుల బిల్లు పెట్టలేదు. అయితే తాజాగా మరోసారి ఈ రెండు పనులు చేసేందుకు సిద్దమవుతోంది.

మూడు రాజధానులపై కదలిక
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం గతంలో హైకోర్టు తీర్పు తర్వాత మౌనంగా ఉండిపోయిన ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి వాటిని తెరపైకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో పాటు అసెంబ్లీలోనూ మరోసారి బిల్లు ప్రవేశపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. అసలే ఎన్నికలకు రెండేళ్ల సమయం కూడా లేని నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి నెలకొంది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు?
అమరావతి స్ధానంలో వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానులు చెల్లవని పేర్కొంటూ హైకోర్టు గతంలో కీలక తీర్పు ఇచ్చింది. దానిపై సీఎం జగన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి హైకోర్టుకు, జడ్డీలకు తమ పరిధిని గుర్తుచేశారు. అయితే హైకోర్టు తీర్పుపై హైకోర్టులోనే అప్పీలుకు వెళ్లడం కానీ, సుప్రీంకోర్టులో సవాల్ చేయడం కానీ చేయలేదు.
దీంతో మూడు రాజధానులపై సాంకేతిక కారణాలతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం అసాధ్యమని అంతా భావించారు. కానీ తిరిగి తాజాగా హైకోర్టులో ప్రభుత్వం గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని చెప్పడంతో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది.

అసెంబ్లీలో బిల్లుకు రెడీ
అదే సమయంలో ఈ వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీలో మరోసారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకన్న నేపథ్యంలో వాటిని సరిచేసి కొత్త బిల్లు ప్రవేశపెడతామని స్వయంగా జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదు.
దీంతో కొత్త రాజధానులు వస్తాయని విశాఖ, కర్నూలు ప్రజలు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. అయితే అంతకు ముందే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి స్టే ఉత్తర్వు తీసుకొచ్చి బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ఏడాదే జగన్ టార్గెట్?
ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలోపు కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్తే మాత్రం 2023లోనే ఎన్నికలు ఉండొచ్చు. దీంతో మూడు రాజధానుల ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో జగన్ సర్కార్ కనిపిస్తోంది.
ముఖ్యంగా హైకోర్టు,సుప్రీంకోర్టులతో ముడిపడిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం కూడా సహకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో అసెంబ్లీలో మాత్రం పూర్తి మద్దతు లభిస్తోంది. దీంతో గట్టిగా ప్రయత్నిస్తే ఏడాది లోపు మూడు రాజధానుల్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అమల్లోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications