ఎస్సీ, ఎస్టీలకు జగన్ సర్కార్ కరెంటు షాక్- కాలనీలు, తండాల్లో ఉంటేనే-లేకుంటే బాకీ వసూల్
ఏపీలో విద్యుత్ సంస్ధలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ ఛార్జీలు పెంచకపోతే మునిగిపోతామని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి.. దీంతో ఏపీఈఆర్సీ ద్వారా ప్రభుత్వం ఛార్జీలు పెంచేసింది. అంతటితో ఆగకుండా ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించే కార్యక్రమం చేపట్టారు. దీనిపైనా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అధే సమయంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తాండాల్లో ఇస్తున్న మినహాయింపుల్లోనూ ప్రభుత్వం కోతలు పెట్టేందుకు సిద్ధమైంది.

ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ బిల్లుల మినహాయింపు
ఎస్సీల కాలనీలు, ఎస్టీల తాండాల్లో 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా వాడుకునేందుకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది ఎస్సీ కాలనీలు, ఎస్టీ తాండాల్లో ఈ మేరకు పేదలు ఉచితంగా 200 యూనిట్ల వరకూ విద్యుత్ వాడుకుంటున్నారు. దీనిపై తాజాగా ప్రభుత్వం కన్ను పడింది. ఈ మేరకు వారికి ఇస్తున్న ఉచిత విద్యుత్ లో కోతలు పెట్టేందుకు డిస్కంలు రెడీ అయిపోయాయి. ప్రభుత్వం తాజాగా చేసిన మార్పులతో డిస్కంలకు ఈ ఉచిత విద్యుత్ వాడుకుంటున్న వినియోగదారులకు షాకి ఇచ్చేందుకు వెసులుబాటు లభించింది.

కాలనీలు, తండాల్లో ఉంటేనే రిలీఫ్
ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో ఉండేవారికి మాత్రమే ఉచిత విద్యుత్ ఇచ్చేలా వాటి బయట ఉండే వారికి మాత్రం ఈ పథకం వర్తించకుండా ప్రభుత్వం కోతలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ కాలనీలు, తండాల బయట ఉంటే ఎస్సీ, ఎస్టీలు కూడా ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారిని ఇందులో నుంచి తప్పించి కాలనీలు, తండాల్లో ఉండే కనెక్షన్లకే దీన్ని పరిమితం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు లెక్కలు తీయాలని విద్యుత్ సంస్ధలకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది.

బయట ఉంటే బాకీలూ వసూల్
ఇప్పటివరకూ రాష్ట్రంలో అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాలతో సంబంధం లేకుండా ఆయా వర్గాలు కుల ధృవీకరణ పత్రం సమర్పించి ఉచిత విద్యుత్ మినహాయింపు పొందేవారు. రాష్ట్రంలో ఇలాంటి కనెక్షన్లు 17 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఇలా కాలనీలు, తండాల్లో నివసించని వారి వివరాలు తీసుకుంటోంది. వారికి ఉచిత విద్యుత్ ప్రయోజనం లభించదని స్పష్టం చేస్తోంది. అంతే కాదు వారు ఇప్పటివరకూ వాడుకున్న విద్యుత్ కు లభించిన రాయితీని తిరిగి వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో డిస్కంల అధికారులు ఈ మేరకు వివరాలు సేకరించే పనిలో పడ్డారు.