సీపీఎస్ చర్చల బహిష్కరణ-ఉద్యోగులకు బొత్స వార్నింగ్-రాకపోతే అదే ఫైనల్
ఏపీలో సీపీఎస్ విధానం రద్దు కోరుతూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటం తుదిదశకు చేరుకుంటోంది. గతంలో వైసీపీ ఇచ్చిన హామీని తప్పకుండా అమలుచేయాల్సిందేనంటూ ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గడాన్ని నిరసిస్తూ ఈ నెల 11న ఛలో విజయవాడకు కూడాసిద్దమవుతున్నాయి. దీంతో మంత్రుల కమిటీ వారితో చర్చలకు సిద్ధమైంది. అయితే సీపీఎస్ పై చర్చకు అయితే తాము రాబోమంటూ కొన్ని ఉద్యోగసంఘాలు తేల్చిచెప్పేశాయి. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది.
కొన్ని ఉద్యోగ సంఘాలు సీపీఎస్ పై మంత్రుల కమిటీ సమావేశాన్ని బహిష్కరించడం వారిష్టమని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వారు రాకుంటే సీపీఎస్ నే వారు అంగీకారిస్తున్నారని ప్రకటిస్తామన్నారు. చర్చలకు వస్తేనే కదా... ప్రభుత్వ నిర్ణయం వారికి తెలిసేది అని అన్నారు. పలుమార్లు ఉద్యోగ సంఘాలతో తాను జరిపిన చర్చలు అఫిషియల్ కాదన్నారు. తాను తన అవగాహన కోసం, వారు తనపై చూపిన గౌరవం వల్లే చర్చలు జరిపామన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ తో జరిపే చర్చలే అఫిషియల్ అని బొత్స తెలిపారు.

చర్చలకు వస్తేనే కదా అన్ని సమస్యలు చర్చించేదని ఉద్యోగుల్ని ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. గతంలో తాము సీపీఎస్ రద్దు హామీ ఇచ్చామని, ఆర్థిక సమస్యలు , కేంద్ర ప్రభుత్వంతో వున్న ఇబ్బందుల వల్ల వీలు కాదని చెబుతున్నామని బొత్స తెలిపారు. మెదటి నుండి జీపీఎస్ ద్వారా అదనపు మేలు చేస్తామని చెబుతున్నామన్నారు. ఓపీఎస్ విధానం మాత్రం సాధ్యం కాదన్నారు. ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ విధానం అమలు చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని బొత్స తేల్చిచెప్పేశారు. దీంతో ఇవాళ సాయంత్రం ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చేసే చర్చలు కీలకంగా మారాయి.












Click it and Unblock the Notifications