చంద్రబాబు షాకయ్యేలా ఆ లెక్కలతో జగన్ సుదీర్ఘ పోస్ట్!!
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టిన ఆయన హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారన్నారు.
అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు
అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చిమోసం కాదా? అంటూ నిలదీశారు. చంద్రబాబూ... ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణంనుంచే మీరు ప్లేటు ఫిరాయించారన్నారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీచేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు.

వైసీపీ హయాంలో ఇచ్చిన పథకాలపై చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్
తల్లికి వందనం, రైతు భరోసా, ఫీజు రియింబర్స్‌మెంట్, వసతిదీవెన, సున్నావడ్డీ లేదన్నారు. 18సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మలకు నెలకు రూ.1500 జాడేలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదు, రూ. 3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదు. రూ.20వేలు ఇస్తానన్న మత్స్యకార భరోసా అడ్రస్సే లేదన్నారు. ఆరోగ్యశ్రీ చెల్లింపులు రూ.1600కోట్లు పెండింగ్ ఉందన్నారు. ఇంటింటి పెన్షన్, ఇంటికి వచ్చే రేషన్, వాలంటీర్ల విషయంలోనూ మోసం చేశారన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల ఏకరువు
విత్తనాలకోసం రైతులు క్యూలో నిలబెట్టారు. పంటలకు ఉచిత బీమా ఎగరగొట్టారని చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టారు. లా అండర్ ఆర్డర్ పూర్తిగా గాడితప్పింది. రెడ్‌బుక్ రాజ్యమేలుతోంది. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోంది. మహిళలకు రక్షణే లేదు. దిశయాప్ అటకెక్కింది. ఇంగ్లిషుమీడియం గాడితప్పింది, బడుల్లో, గ్రామాల్లో పరిశుభ్రత పడకేసింది. రెండున్నర నెలల్లోనే ప్రజలను ఇంతలా దగాచేస్తారా చంద్రబాబూ? అని మండిపడ్డారు.
సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ చాలా వాగ్దానాలు
ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్లమేర రాష్ట్రం అప్పులపాలైందని, శ్రీలంక అయిపోయిందని, ఊరూరా విష ప్రచారం చేశారు. అయినా సరే అపార అనుభవం ఉంది. అన్నీ అమలు చేసే బాధ్యత నాదీ అని, సూపర్ సిక్స్ అంటూ సూపర్ టెన్ అంటూ చాలా చాలా వాగ్దానాలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు.
మా హయాంలో చేసిన అప్పులు ఇవే
గవర్నర్ తో అసెంబ్లీలో అనేక అవాస్తవాలను చెప్పించారని మండిపడ్డారు. నిజాలు ఏంటంటే.. జూన్ 2024నాటికి ఉన్న మొత్తం అప్పులు రూ.7,48,612కోట్లు అని పేర్కొన్నారు . ఇందులో 2019లో మీరు దిగిపోయేనాటికి ఉన్న అప్పులు రూ.4,08,170కోట్లు. దీనికిపైన ఉన్నవి మాత్రమే మా హయంలో చేసిన అప్పులని పేర్కొన్నారు. మీ హయాంలో అప్పుల వృద్ధిరేటు 21.63శాతం అయితే, కోవిడ్ కారణంగా ఆర్థికవ్యవస్థలో మహా సంక్షోభం వచ్చినా, మా హయాంలో అది కేవలం 12.9 శాతం.
మీ హయాంలో అప్పుల లెక్కలు జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు
సమగ్ర వివరాలు ఈ లింక్ https://bit.ly/4dkOKru లో ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబు అని పేర్కొన్నారు. ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలను ఆపేసి, అబద్దపు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మాని, సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను తు.చ. తప్పక అమలు చేయండి. ఇప్పటికే దిగజారిన పాలనను గాడిలో పెట్టండి అంటూ చంద్రబాబుకు జగన్ హితవు పలికారు.












Click it and Unblock the Notifications