జగన్ గారు న్యాయం చేయండి..మీ ఎమ్మెల్యే వేధిస్తున్నారు : రైతు ఫ్యామిలీ వేడుకోలు -పొలాలను ట్రాక్టర్లతో తొక్కించి.
అధికార పార్టీ ఎమ్మెల్యే రైతులను వేధిస్తున్న వీడియోలు ఇప్పుడు వైసీపీలో కలకలానికి కారణమవుతున్నాయి. రైతు పక్షపాత ప్రభుత్వంగా అటు ముఖ్యమంత్రి పదే పదే చెబుతుంటే..క్షేత్ర స్థాయిలో కొందరు ఎమ్మెల్యేల తీరు భిన్నంగా ఉంటోంది. తాజాగా.. శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి భూ ఆక్రమణ ఆరోపణలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. శింగనమల నియోజకవర్గంలోని కొర్రపాడు గ్రామంలో నాగలింగారెడ్డి అనే రైతు పంట పొలాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఆక్రమిస్తున్నారనే వీడియోతో పాటు పంట పొలంలో రైతులపై దౌర్జన్యం చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శింగనమల ఎమ్మెల్యేపై ఆరోపణలు
నియోజకవర్గ పరిధిలోని బుక్కరాయసముద్రం కొర్రపాడు గ్రామంలో హైవేపై రైతు నాగలింగారెడ్డికి పొలం ఉంది. అయితే దాని పక్కనే ఇటీవల జొన్నల గడ్డ పద్మావతి కుటుంబీకులు ఐదు ఎకరాల పొలం తీసుకున్నట్లు సమాచారం. ఆ పొలానికి వెళ్లడానికి వేరే దారి ఉన్నప్పటికీ ప్రధాన రహదారి నుంచి రోడ్డు వేసుకోవాలనేది వారి ఆలోచన. దీని పైన వారితో చర్చించారు. అందుకు రైతు కుటుంబం సైతం సుముఖత వ్యక్తం చేసింది. మరో రెండు నెలల్లో వరి పంట చేతికి వస్తుందని... అనంతరం రహదారి విషయంపై మాట్లాడదాం అని వారు వేడుకున్నారు.

పచ్చటి పొలాలను ట్రాక్టర్లతో తొక్కించి
అయినా..మాటలు పట్టించుకోని అధికారులు ట్రాక్టర్ తో పచ్చడి పొలంలో తొక్కించడం పైన బాధిత రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎలాంటి దారి లేకున్నా తమ భూముల నుంచి రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నారంటూ రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అప్పట్లో వైఎస్సార్ కు మద్దతుగా పని చేసామని..ఇప్పుడు ఆయన కుమారుడిని నమ్మి మద్దతుగా ఉన్నామని ఆ రైతు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

సీఎం ఆదుకోవాలంటూ వేడుకోలు
ఇప్పటికైనా సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని అభ్యర్ధిస్తున్నారు. ఎమ్మెల్యే అధికారంలో ఉన్నామని దౌర్జన్యానికి దిగుతున్నారని..తమకు చేతికి వచ్చిన పంటను పాడు చేస్తారని ఆందోళన చెందుతున్నారు. తమ పొలంలో లేదని గతంలో కోర్టు ఆర్డర్ ఇచ్చిందని...తమ పొలంలో ట్రాక్టర్ తో తొక్కింది అడ్డుకున్న తమను బలవంతంగా తీసుకెళ్లిపోయాంటూ రైతు భార్య లాక్షి దేవి ఆవేదన వ్యక్తం చేసారు. తమ పొలంలో ఎమ్మెల్యే మనుషులే దౌర్జన్యం చేస్తుంటే తాము ఎవరికి చెప్పుకోవాలంటూ రోదిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది.












Click it and Unblock the Notifications