బాబు ఎఫెక్ట్: సోనియా గాంధీపై దుమ్మెత్తిపోసిన జగన్

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తున్న జగన్ సోనియా గాంధీపై చాలా రోజుల తర్వాత విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెసు రాష్ట్రాన్ని విభజిస్తోందని అన్నారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి కొన్ని సీట్లను గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు అందుకు పాల్పడుతోందని ఆయన అన్నారు.
సోనియా గాంధీ ఇటలీ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ఇండియన్ నేషనల్ కాంగ్రెసును జగన్ ఇటాలియన్ నేషనల్ కాంగ్రెసుగా అభివర్ణించారు. తమ రాష్ట్రంలో సోనియా గాంధీ చేసిన పని బ్రిటిష్ వాళ్లు కూడా చేయలేదని ఆయన అన్నారు.
విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే కొట్టడం సీమాంధ్ర పార్లమెంటు నుంచి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసే కుట్రలో భాగంగా జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీయే అల్లర్లను ప్రేరేపిస్తోందని, పథకం ప్రకారం ఆ పనిచేస్తున్నారని, తమకు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో వారు ఆ చర్యకు దిగారని, ఎన్నికలు కొద్ది నెలలు మాత్రమే ఉన్న సమయంలో తమ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆయన అన్నారు.
గొంతు నొక్కడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు. చర్చ లేకుండానే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications