ఆకాశం ఊడిపడలేదు: రాష్ట్ర విభజనపై జైపాల్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర విభజన వల్ల ఆకాశం ఊడిపడినట్లు, జలప్రళయం వచ్చినట్లు ఆందోళన చెందడం బాధాకరమని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు ఆవేదనను కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాదులోని లేక్‌వ్యూ అతిథిగృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీమాంధ్రుల ఆందోళనలో తీవ్ర ఉందని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఒప్పందాలు జరిగాయని, విడిపోయినప్పుడు కూడా ఒప్పందాలు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. సీమాంధ్రలో తనకు మిత్రులు ఉన్నారని, తాను సీమాంధ్రులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
తాను వ్యక్తిగతంగా ఎవరిపై మాట్లాడదలుచుకోలేదని, రాజకీయ పార్టీల గురించి కూడా మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. తాను బ్రతికి ఉండగా సీమాంధ్రకు అన్యాయం జరగదని జైపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. విభజన తలెత్తే సమస్యల పరిష్కారంకోసమే మంత్రులతో కూడిన ఒక బృందాన్ని నియమిస్తున్నారని వివరించారు. ఆ బృందాన్ని ఎవరైనా కలుసుకోవచ్చునని ఆయన అన్నారు. విభజన తర్వాత ఏమవుతుందోనన్న సీమాంధ్రుల భయానికి ప్రస్తుత ఉద్యమం అద్దం పడుతోందని, వాటిని పరిష్కరించాల్సి అవసరం ఉందని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వివరిస్తూ అందరికీ ఆనందం కలిగించే నిర్ణయాలు ఎప్పుడూ ఉండవని ఆయన అన్నారు. హైదరాబాద్ ఇక్కడే ఉంటుంది, ఎవరూ పట్టుకుపోరని, 400 ఏళ్ల నుంచి ఇక్కడే ఉందని, ఎక్కడికీ పోలేదని ఆయన అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుందని, ఈ పదేళ్లలో సమస్యలు పరిష్కరించుకుంటామని ఆయన అన్నారు. హైదరాబాదు అందరి సొత్తు అని ఆయన అన్నారు. తెలంగాణ జిల్లాలవారు ముంబై వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాదులోని ఉద్యోగులు వెళ్లిపోవాల్సిన అవసరం లేదని అన్నారు.
తాను జాతీయ వాదిని అని, రాజ్యాంగ వాదిని అని ఆయన చెప్పుకున్నారు. ఇక్కడ కూడా నూటికి నూరు పాళ్లు రాజ్యాంగం అమలు జరుగుతుంది అని ఆయన చెప్పారు, హైదరాబాద్ ఎవరి సొంతం కాదని, ఇది అందరి నగరం అంటూ భారత దేశంలో ఎవరు ఎక్కడైనా ఉండవచ్చునని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడైనా ఉండే హక్కును రాజ్యాంగం కల్పించిందని ఆయన అన్నారు. ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, వారికి రాజ్యాంగ బధ్దమైన రక్షణ ఉంటుందని ఆయన వివరించారు.
తనకు సముద్రం అంటే చాలా ఇష్టమని, తాను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత విశాఖపట్నంలో ఉండవచ్చు లేదా ముంబైలో ఉండవచ్చునని జైపాల్ రెడ్డి హైదరాబాద్‌లో ఆస్తుల రన్నారు. క్షణ గురించిగాని, శాంతిభద్రతల విషయంలో గాని ఎవరూ ఆందోళన చెందనక్కరలేదని ఆయన భరోసా ఇచ్చారు. సీమాంధ్రలో ఆందోళనలు పెరిగాయో పెంచారో తెలియదని అన్నారు. రాష్ట్ర విభజన ఏ కోర్టుకు వెళ్లినా ఆగదని ఆయన స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పాం, మోసాలు చేశామని, వాటిని ఎత్తి చూపడం కన్నా ఆందోళనలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications