విశ్వాస ఘాతకురాలు: పురంధేశ్వరిపై జైరాం వ్యాఖ్య
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి జైరాం రమేష్ మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిపై సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన పురంధేశ్వరిపై ఆయన శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పురంధేశ్వరి విశ్వాస ఘాతుకురాలని, స్వార్థపరురాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పురంధేశ్వరి అడిగినవన్నీ ఇచ్చామని జైరాం రమేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రామాయపట్నం వద్ద పురంధేశ్వరి వేల ఎకరాల భూములు కొన్నారని తెలిపారు. అక్కడే పోర్టు నిర్మాణం చేయాలని ఆమె డిమాండ్ చేశారని జైరాం చెప్పారు. అయితే తాము దుగరాజపట్నం వద్దే పోర్టు నిర్మించేందుకు నిర్ణయించామని తెలిపారు. దీంతో ఆమె పార్టీనే వీడేందుకు సిద్ధపడ్డారని జైరాం తెలిపారు.

ఒక వేళ పురంధేశ్వర కాంగ్రెస్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీని వీడారనుకుంటే.. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరారో అర్థం కావడం లేదని జైరాం రమేష్ అన్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్ర కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు అసంతృప్తితో ఉన్నప్పటికీ ఎవరూ పార్టీని వీడలేదని తెలిపారు.
గత 8ఏళ్లుగా కేంద్రమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఆ పార్టీనే విమర్శించడం తగదని జైరాం రమేష్ అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీ నాయకుల డిమాండ్లను పరిగణలోకి తీసుకోలేదని అనడం సరికాదని ఆయన చెప్పారు. హైదరాబాద్ యూటి తప్ప సీమాంధ్ర నేతలు కోరినవన్నీ చేశామని జైరాం రమేష్ తెలిపారు. పురంధేశ్వరి పార్టీని వీడి ద్రోహం చేశారని జైరాం రమేష్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications