సిఎల్పీనేత జానా, మండలిలో డిఎస్: నిలదీసిన ఎమ్మెల్సీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ సిఎల్పీ నేతగా జానారెడ్డిని ఎన్నుకున్నారు. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, వాయలార్ రవి, కుంతియా, తిరునావక్కరసులు భేటీ అయ్యారు.
21మంది ఎమ్మెల్యేలకు 20 మంది హాజరయ్యారు. జానా రెడ్డిని సిఎల్పీగా ఎన్నుకున్నారు. జానా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జానా పేరును డికె అరుణ ప్రతిపాదించగా... ఉత్తమ్ కుమార్ రెడ్డి బలపర్చారు. తెలంగాణలో పార్టీ వైఫల్యం, సిఎల్పీని ఎన్నుకునే విషయమై దిగ్విజయ్ సింగ్ ఎమ్మెల్యేలను ఒక్కరొక్కరిని పిలిచి అడిగినట్లుగా తెలుస్తోంది.

జానారెడ్డిని సిఎల్పీ నేతగా ఎన్నుకున్న అనంతరం దిగ్విజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. జానాను ఏకగ్రీవంగా సిఎల్పీ నేతగా ఎన్నిక చేసినట్లు చెప్పారు. తెలంగాణ హక్కుల పరిరక్షణకు కాంగ్రెసు పార్టీ పోరాడుతుందన్నారు. అనంతరం జానా రెడ్డి మాట్లాడారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. తాము అసెంబ్లీలో, బయట సమన్వయంతో వెళ్లి తెలంగాణ అభివృద్ధికి, కాంగ్రెసు పార్టీ పునర్ వైభవానికి కృషి చేస్తామని చెప్పారు.
కాంగ్రెసు పార్టీని అన్ని విధాలుగా అగ్రభాగానికి తీసుకు పోతామన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నేపథ్యంలో సోనియా శుభాకాంక్షలు తెలిపారన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియా పేరు ఉంటుందన్నారు. పార్టీ ఫణంగా పెట్టి తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాణాత్కక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, 2019లో అధికారంలోకి వస్తామని తెలిపారు.
మండలిలలో ప్రతిపక్ష నేతగా డిఎస్
శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా డి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షబ్బీర్ అలీని డిప్యూటీగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్, షబ్బీర్ అలీలు మాట్లాడుతూ... పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. కాగా.. డిఎస్ ఎంపిక పైన ఎమ్మెల్సీ రాజలింగం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని బతకనివ్వరా అంటూ పార్టీ పెద్దలను నిలదీశారు. సమావేశం నుండి బయటకు వచ్చారు.












Click it and Unblock the Notifications