కాకినాడ కేంద్రంగా పవన్ మంత్రాంగం ? రేపటినుంచి మూడ్రోజుల బస-జనసేన సీట్లు ఫైనల్ ?
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్ల పంపకాల్ని సైతం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడలో బస చేయబోతున్నారు. ఏకధాటిగా మూడు రోజుల పాటు అక్కడే జనసేన నేతలతో కీలక చర్చలు జరపబోతున్నారు. ఈసారి గోదావరి జిల్లాల్లో ప్రతీ సీటూ గెలవాలని కోరుకుంటున్న పవన్.. అందుకు తగ్గట్టు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యంలో రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో పరిస్ధితి ఎలా ఉన్నా తమకు పట్టుందని భావిస్తున్న గోదావరి జిల్లాల్లో మాత్రం ఈసారి పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ ఇన్ ఛార్జ్ లను మార్చేందుకు జగన్ సంకేతాలు ఇచ్చేయడంతో ఆయా స్ధానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లిపోయారు. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ ఎంచుకునేందుకు అసంతృప్త ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారితో నేరుగా కానీ, అనుచరులతో కానీ చర్చలు జరిపేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.

రేపు కాకినాడ వెళ్లి ఈ నెల 27, 28, 29 తేదీల్లో అక్కడే ఉండేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నారు. కాకినాడలో ఉంటూ ఉమ్మడి గోదావరి జిలాల్లో నేతలను పిలిపించుకుని మాట్లాడేందుకు పవన్ సిద్దమవుతున్నారు. ఈ సందర్భంగా జనసేనలో నేతల చేరికలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే వైసీపీ టికెట్ నిరాకరించిన పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ఫ్యామిలీ పవన్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది. ఇదే కోవలో మరికొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీ-జనసేన ఉమ్మడి గోదావరి జిలాల్లో పోటీ చేసే స్ధానాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వాటిని ఫైనల్ చేసుకునేందుకే పవన్ కళ్యాణ్ కాకినాడలో బస చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫైనల్ చేసిన అభ్యర్ధులతో మాట్లాడి వారిని టీడీపీతో ఎలా సమన్వయం చేసుకోవాలన్న దానిపై పవన్ సూచనలు చేసే అవకాశముంది. ముఖ్యంగా ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీ-జనసేన కూటమి ఎత్తుల్ని చిత్తు చేయాలని వైసీపీ లెక్కలేసుకుంటున్న తరుణంలో పవన్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications