బందరు సభ టర్నింగ్ పాయింట్-ఇప్పటం కూల్చివేతలతో పైశాచికానందం-నాదెండ్ల కామెంట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మరోసారి విరుచుకుపడ్డారు. భీమవరం జిల్లాలో ఇవాళ పర్యటించిన నాదెండ్ల.. గుంటూరు జిల్లా ఇప్పటంలో ప్రభుత్వం మరోసారి కూల్చివేతలకు దిగడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే ఈ నెల 14న బందరులో నిర్వహించే జనసేన ఆవిర్భావ సభపైనా ఆయన స్పందించారు.
రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు మచిలీపట్నం సభ నాంది పలుకుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.వైసీపీని ఇంటికి పంపించే విధంగా పోరాటం చేద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అంధకారం నుంచి అభివృద్ధిపథంలో నడిపిద్దామన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్ని అటుపోట్లు ఎదురైనా నీతిగా, నిజాయతీగా నిలబడ్డారని ప్రశంసించారు. ఇప్పటంలో ఇళ్లు కూలగొట్టి సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని నాదెండ్ల విమర్శించారు. వైసీపీ అరాచకపాలన అంతమయ్యే రోజులు దగ్గరపడ్డాయన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మచిలీపట్నంలో జరగనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఉండబోతుందని, సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీని ఇంటికి పంపించే విధంగా మనందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. సంక్షేమం అంటే బటన్ నొక్కడం కాదని, స్పందించే మనస్తత్వం ఉండటమని అన్నారు.
రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటపడేసి అభివృద్ధిపథంలో నడిపించే నాయకత్వాన్ని ఎన్నుకుందామని పిలుపునిచ్చారు. జనసేన నాయకుల్లో దమ్ము, ధైర్యం, పట్టుదల ఉంది కాబట్టే ప్రభుత్వం మనల్ని చూసి భయపడుతోందని, జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మరింత బలంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications