టీడీపీ అవినీతిపై రాపాక ఫైర్: సీఎం జగన్ సహకరించాలంటూ: స్పీకర్ ఆసక్తి కర సూచన..!
ఏపీ శాసనసభా సమావేశాల్లో హాట్ టాపిక్ గా మారిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ టీడీపీ పైన మండిపడ్డారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతన్న సమయంలో తన నియోజకవర్గంలో రహదారుల గురించి రాపాక ప్రస్తావించారు. ఆ సమయంలో టీడీపీ హాయంలో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు.
తూర్పు గోదావరి జిల్లాలో తన నియోజకవర్గం రాజోలు చివర ఉంటుందని..గతం లో అక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే హాయంలో ఎటువంటి డెవలప్ మెంట్ జరగలేదని..ఆయన మాత్రం సొంతంగా కాలేజి నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. అదే సమయంలో రాపాక తనకు మాట్లాడే అవకాశం లేకుండా టీడీపీ అల్లరి చేస్తుందనే వ్యాఖ్యలతో ఏకీభవించిన స్పీకర్..ఆసక్తి కర సూచన చేసారు.

టీడీపీ హాయంలోనే భారీగా అవినీతి..
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశాల్లోనే ఇంగ్లీషు మీడియం స్కూళ్ల ఏర్పాటులో ప్రభుత్వ నిర్ణయానికి రాపాక మద్దతు ప్రకటించి వార్తల్లో నిలిచారు. తమ పార్టీ అధినేత వైఖరికి భిన్నంగా ఆయన వ్యవహరించారనే ప్రచారం సాగింది. ఆ తరువాత ఎస్సీ..ఎస్టీ సంక్షేమం పైన చర్చ సందర్భంగానూ ముఖ్యమంత్రి జగన్ ను రాపాక ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక, ఇప్పుడు సభలో రాపాక ఏకంగా టీడీపీ హాయంలో జరిగిన అవినీతిని ప్రస్తావించారు. తెలుగుదేశం ప్రభుత్వం హాయంలోనే ఉపాధి హామీ నిధుల్లో భారీగా అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారు. అదే విధంగా సభలో తన లాంటి వారికి మాట్లాడే అవకాశం లేకుండా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని..వారిని నియంత్రించాలని స్సీకర్ ను అభ్యర్ధించారు. తమ హక్కులను టీడీపీ సభ్యులు కాల రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

రాజోలులో టీడీపీ నేత మాత్రమే..
2014 రాజోలు నుండి టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన సూర్యారావు నియోజకవర్గానికి చేసింది ఏదీ లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఎక్కడా డెవలప్ మెంట్ జరగలేదని..ఆయన మాత్రం కోట్లాది రూపాయలతో సొంత కాలేజి నిర్మించుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో గతంలో కేటాయించిన పనులను సైతం రద్దు చేసారని చెప్పుకొచ్చారు.ఇప్పటికైనా నియోజకవర్గంలో డెవలప్ మెంట్ కోసం తాను సీఎం ను ప్రత్యేకంగా అభ్యర్ధిస్తున్నానని కోరారు.
తన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని.. జిల్లాలో చివరి నియోజకవర్గం తనదని వివరించారు. ప్రభుత్వం తన నియోజకవర్గం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని అభ్యర్దించారు. మంత్రి ధర్మాన చెప్పిన సమాధానం తరువాత మరోసారి రాపాక మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్పీకర్ ఆసక్తి కర సూచనతో..
తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని..టీడీపీ సభ్యులు అల్లరి దారుణంగా ఉందంటూ జనసేన ఎమ్మెల్యే రాపాక చేసిన వ్యాఖ్యల పైన స్పీకర్ స్పందించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొని.. టీడీపీ సభ్యులు ఇబ్బంది కలిగిస్తున్నారని..అదే విషయం పలుమార్లు వారికి చెప్పానని గుర్తు చేసారు. అసలు..ఈ వ్యవహారం పైన మీరు వారి పైన చర్యలు కోరుతూ ఎందుకు ప్రయివేటు తీర్మానం ప్రవేశ పెట్టకూడదంటూ సూచన చేసారు.
సభలో ఈ పరిస్థితి మీద ఒక విధానం నిర్ణయించకపోతే.. సభా కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బంది ఏర్పడుతుందని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేసారు. దీనికి సరే అన్నట్లుగా రాపాక నమస్కారం చేస్తూ..అంగీకారం తెలిపారు. వచ్చే సమావేశాల్లో రాపాక ఈ ప్రయివేటు తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications