రూటు మార్చిన పవన్ - కొత్త రాజకీయం మొదలు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల తరువాత పార్టీ వ్యవహారాల పైన పూర్తి సమయం కేటాయించిన పవన్.. ఇప్పుడు రూటు మార్చారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా తొలి అడుగు వేస్తున్నారు.
జనసేన భవిష్యత్ పై డిప్యూటీ సీఎం పవన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ... కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. కూటమిలో కొనసాగుతూనే.. పార్టీ బలోపేతం దిశగా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా జనసేన సభ్యత్వ నమోదు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదుతో అన్ని వర్గాల వారినీ, అన్ని రంగాల వారినీ కలుసుకుని పార్టీకి దగ్గర చేసే గొప్ప అవకాశం ఈ నెల 26 నుంచి మార్చి 10వరకు కలుగుతుందన్నారు. దీనిద్వారా పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని చాటిచెబుదామని, స్థానిక ఎన్నికలకు సభ్యత్వ నమోదును సన్నద్ధతగా భావిద్దామని పిలుపునిచ్చారు.

క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతం దిశగా
కాగా, ఈ కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో గురువారం లాంఛనంగా ప్రారంభమైందని మనోహర్ చెప్పుకొచ్చారు. 2020లో 5 నియోజకవర్గాల్లో ఫైలెట్ విధానంలో మొదలుపెట్టిన కార్యక్రమం.. గతేడాది 12.18 లక్షలకు చేరిందన్నారు. మొదటి ఏడాది 94 వేల మంది చేరితే అది ప్రతి ఏటా పెరుగుతూ వెళ్లిందని చెప్పారు. కరోనా సమయంలోనూ 3.30 లక్షల మందిని సభ్యులుగా చేరారని గుర్తు చేసారు. ప్రతి నియోజకవర్గం నుంచి 75 నుంచి 100 మంది సాధక్‌ల పేర్లను సత్వరమే అందజేయాలని సూచించారు. ఉద్యమి సభ్యత్వం తీసుకున్నవారు రూ.400 చెల్లించాలని... వీరికి ప్రమాద బీమా ప్రయోజనాలు అందుతాయని వివరించారు. అలాగే పార్టీకి పరోక్షంగా సహాయసహకారాలు అందించే వారిని ప్రదాత అని పిలుస్తామని వెల్లడించారు. సాధక్ లకు అందుబాటులో ఉండేలా.. ప్రత్యేక కాల్ సెంటర్ ఈ రెండు వారాలూ పనిచేస్తుందని... జెన్ జీ తరం సరికొత్తగా ఆలోచిస్తోందని మనోహర్ వివరించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి పరిశీలకులను నియమించనున్నట్లు మనోహర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications