జనసేనదే అధికారం .. మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ కూడా జోస్యం చెప్పారుగా
Recommended Video
ఏపీలో పొలిటికల్ హీట్ ఎన్నికలు ముగిశాక కూడా తగ్గటం లేదు. రాజకీయ నాయకుల సంచలన ప్రకటనలతో , అనూహ్య ఘటనలతో రాజకీయం రసకందాయంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన నుండి విశాఖ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏ లెక్కలతో ఆయన చెప్పారో తెలీదు కానీ జనసేన ఏపీలో అధికారంలోకి వస్తుందని మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు .
జన్సేన నేత మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జోస్యం .. అధికారం జనసేనదే
ఏపీలో రానున్నది జనసేన ప్రభుత్వమేనని, అత్యధిక మెజారిటీతో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని జనసేన పార్టీ నేత సీబీఐ మాజీ జేడీ, ఆ పార్టీ విశాఖ లోక్‌సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు . ఇప్పటికే టీడీపీ 130 సీట్లను గెలిచి అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్తే , జగన్ సీఎంగా ప్రమాణం చెయ్యటానికి ముహూర్తం దేవుడే నిర్ణయిస్తాడని సంచలన వ్యాఖ్య చేశారు. ఇక తామేమీ తక్కువ కాదంటూ ఎన్నికల ఫలితాల తరువాత అత్యధిక మెజారిటీ సాధించేది జనసేన అభ్యర్థులే అని అన్నారు వీవీ లక్ష్మీ నారాయణ.

జనసేన అధికారంలోకి వస్తుంది .. ఎవరికీ మద్దతివ్వం , ఎవరి మద్దతు తీసుకోము .. మాజీ జేడీ
విజయనగరం జిల్లా ఎస్.కోటకు వచ్చిన ఆయన స్థానికులతో మరియు విలేకరులతో మాట్లాడిన జనసేన నేత లక్ష్మీ నారాయణ తామెవరికీ మద్దతివ్వమని , తీసుకోబోమని చెప్పారు. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తాను సర్వీసును విడిచిపెట్టి మంచిపని చేశానని, ప్రజల మధ్య సంతోషంగా గడుపుతున్నానని చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల్లో నాయకులు ఇచ్చిన డబ్బులు తీసుకోవడం వల్ల మీరు చులకనగా మారారు. మీ సమస్యలను వారు తీర్చడం లేదు' అని లక్ష్మీనారాయణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు . మొత్తానికి జనసేన నేతగా మారిన మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ కూడా అధికారం జనసేనదేనని జోస్యం చెప్పటం విశేషం .












Click it and Unblock the Notifications