అల్లరిచిల్లర, వైయస్ భరించలేక: జగన్‌పై జెసి సంచలనం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పెద్దలంటే ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు.
చిన్నప్పటి నుండి జగన్ అల్లరి చిల్లరగా తిరిగే వాడన్నారు. ఇంట్లో అందర్నీ కొట్టేవాడని విమర్శించారు. జగన్ స్నేహితులు మంగలి కృష్ణ, మొద్దు శీనులను చదువుకోమని ఇంగ్లాండుకు పంపితే నామాలు పెట్టి వచ్చారని ఎద్దేవా చేశారు. జగన్‌ను భరించడం సాధ్యం కాదని.. బెంగళూరుకు పంపిస్తానని స్వయంగా వైయస్ రాజశేఖర రెడ్డియే చెప్పారన్నారు.

జగన్ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో ఎవరికీ తెలియదన్నారు. దారినపోయే వారిని అడిగితే కనీసం పదివేల కోట్లు ఉన్నాయని చెబుతారన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం 5 నుండి 10 కోట్ల రూపాయలు, ఎంపీ టిక్కెట్‌కు 35 నుండి 50 కోట్లు అడుగుతున్నారన్నారు. జగన్‌కు ఉన్నంత ధనదాహం ఎవరికీ లేదని ధ్వజమెత్తారు. మే నెల తర్వాత జగన్ పార్టీ ఉండదన్నారు. జగన్ వంటి దురుసు స్వభావి చేతిలో రాష్ట్రాన్ని పెడితే అధోగతి తప్పదన్నారు.
కాగా, జెసి దివాకర్ రెడ్డి ఇటీవలె తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీ ఖాళీ అవుతుందని చెబుతూ పలువురు కాంగ్రెసు నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. జెసి ఇటీవలె టిడిపిలో చేరారు.












Click it and Unblock the Notifications