జగన్ దీక్ష దేనికోసం, బాబు తప్పేమీ లేదు: జేసీ, పదేళ్ల హోదాపై వెంకయ్యకు ప్రశ్న?
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిందని, ఇక ఉద్యమాలతో ఉపయోగం లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా రాదని కేంద్రం తేల్చిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఎందుకు దీక్ష చేస్తున్నారో ఆయన చెప్పాలని జేసీ డిమాండ్ చేశారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పేమీ లేదని, ఎన్నికల సమయంలో అందరూ డబ్బులు పంచారని ఆయన తెలిపారు. మన దేశంలో చట్టం వేరని, కానీ రాజకీయాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు వేరని ఆయన అన్నారు. ఇటీవల పాకిస్థాన్ భూభాగంలోకి భారత సైన్యం చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రయిక్స్ చేయడంపై కూడా జేసీ స్పందించారు.
పొరుగుదేశమైన పాకిస్థాన్‌తో వందేళ్లయినా వివాదం తెగదని, శత్రుశేషం, రుణ శేషం ఉండకూడదని జేసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా సాధన దిశగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా యువభేరీల పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

పదేళ్ల హోదాపై వెంకయ్యకు గుర్తుకు లేదా?
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇవ్వాలన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి ఇప్పుడు ఆ విషయం గుర్తుకు రావడం లేదా? అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలపై కేంద్రం మోసం చేస్తుందని అన్నారు.
రాష్ట్రంలోని వెనుకబడిని జిల్లాలకు ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీల విషయంలో కూడా కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాగైతే ఏపీకి కొత్త పరిశ్రమలు ఎలాగొస్తాయని ప్రశ్నించారు. వెనక బడిన జిల్లాలుగా ఏడు జిల్లాలనే ఎంపిక చేయడం చాలా దారుణమని అన్నారు. చట్టంలో చెప్పిన అంశాలపై బీజేపీ, టీడీపీ మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications