బొత్స,కిరణ్ దొంగలు: జెసి నిప్పులు, ముళ్లకంచే వేయాలి
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఉన్నదే పార్టీ గీత దాటిన వారిపై చర్యలు తీసుకోవడానికి అని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ అనంతపురం జిల్లా సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం కౌంటర్ ఇవ్వడమే కాకుండా ఆయన, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ తోడు దొంగలేనని ధ్వజమెత్తారు.
విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతానికి మాచర్లను రాజధాని చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. అదే సమయంలో ముఖ్యమంత్రి, బొత్స ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరిగే సమయంలో తెలంగాణ, సీమాంధ్ర ఎమ్మెల్యేల మధ్య ముళ్ల కంచె వేయాలన్నారు. లేదంటే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని వ్యాఖ్యానించారు.

సీమాంధ్ర కేంద్రమంత్రులు నిజాలు దాచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పార్టీని ధిక్కరించే వారిపై బొత్స చర్యలు తీసుకోవచ్చునని చెప్పారు. మాచర్లను రాజధాని చేయమని సూచించడం వెనుక ఎలాంటి స్వార్థం లేదన్నారు. అక్కడ తనకు భూములేవీ లేవని, అందరికీ అందుబాటులో ఉంటుందనే చెప్పానన్నారు.
కాగా, ఇతర పార్టీలలోకి వెళ్లేందుకు కాంగ్రెసు పార్టీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారి పైన వేటు వేస్తామని బొత్స సత్యనారాయణ మంగళవారం చెప్పిన విషయం తెలిసిందే. మంత్రులు, ఎవరైనా వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి జాబితాను తాము నిన్నటి నుండి తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీలలోకి వెళ్ళేందుకు పార్టీ పైన బురద జల్లుతున్న డిసిసి, పిసిసి సభ్యుల పైన వేటు వేస్తామన్నారు. ఇది తన మాట మాత్రమే కాదని అధిష్టానం మాట కూడా అన్నారు.












Click it and Unblock the Notifications