టిడిపిలో చేరిన జెసి, అత్యుత్సాహం చూపానని బాబు

జెసి దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి, కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి టిడిపి కండువ కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ పార్టీకి మొదటి నుంచి కార్యకర్తలే బలం అన్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టిన కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని విమర్శించారు. టిడిపి అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీని కార్యకర్తలే ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అధికారం తనకు అప్పగిస్తే స్వర్ణ సీమాంధ్ర, సామాజిక తెలంగాణ తీసుకు వస్తానన్నారు. అన్యాయం జరిగినా అధిగమించే శక్తి తనకు ఉందన్నారు. సీమాంధ్రను ఐదేళ్లలో అగ్రగామిగా నిలబెడుతానని చెప్పారు. అప్పుడు ఫలితాల కోసం అత్యుత్సాహం చూపించానని, ఇప్పుడు ఉద్యోగులను కలుపుకొని వెళ్తానని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చానని తెలిపారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని జెసి దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అన్ని వర్గాల ప్రజలు పోరాటాలు చేసినా సోనియా గాంధీ పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రాన్ని ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా ఒక్క బాబుకే ఉందన్నారు. చంద్రబాబు సమర్ధత గురించి తాను గతంలో శాసనసభలోనే చెప్పానని జెసి గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications