జగన్ కంటే వెయ్యి రెట్లు బెట్టర్: జెసి, ఓట్ల కోసమే: కారెం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇటీవల నిప్పులు చెరుగుతున్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాకర్ రెడ్డి ఆదివారం మరోసారి మండిపడ్డారు. జగన్ కంటే తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెయ్యి రెట్లు మేలు అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సీమాంధ్ర పరిస్థితి అధోగతి కావడం ఖాయమన్నారు. సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే టిడిపిని గెలిపించాలని, చంద్రబాబు అధికారంలోకి రావాలని జెసి అన్నారు.

జగన్ పార్టీపై శివాజీ
మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ జగన్ పార్టీ పైన నిప్పులు చెరిగారు. ఓ వర్గం ఓట్లను కొల్లగొట్టేందుకు జగన్ పార్టీ నేతలు బైబిలు చేతబట్టారని ఆరోపించారు. సీమాంధ్రలో జగన్, తెలంగాణలో కెసిఆర్‌ను చూసుకుని సోనియా రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు.
కెసిఆర్‌పై రుద్రరాజు
ఏదో విధంగా కయ్యానికి కాలుదువ్వి, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన తప్పా, ఆయనకు శాంతియుతంగా సమస్యల్ని పరిష్కరించుకోవడం ఏ కోశానా ఇష్టం ఉండదని తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి రుద్రరాజు పద్మరాజు అన్నారు. విభజన జరుగుతున్న నేపథ్యంలో జివోఎం కొన్ని నామ్స్‌ను కూడా పెట్టడం జరిగిందన్నారు.
సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలోని గానీ, హైదరాబాద్‌లోగానీ ఉన్న వాళ్ళకు ఆప్షన్లు ఉంటాయని జివోఎం స్పష్టంగా చెప్పిందని అయినా కెసిఆర్ సీమాంధ్ర ఉద్యోగులను భయపెట్టి, రేపు జరగబోయే ఎన్నికల్లో వారి మద్దతును కూడగట్టాలనే ఆలోచనతో చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నెరవేర్చారని, విభజన జరిగిన తర్వాత కూడా కెసిఆర్ ఆప్షన్లు ఉండవని వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications