జేసీ Vs ఆది, నీదా నాదా సై - కూటమిలో కొత్త టెన్షన్..!!
కడప జిల్లాలో కొత్త టెన్షన్ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి - బీజేపీ జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య సాగుతున్న వార్ తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గవద్ద ఉన్న ఎల్‌అండ్‌టీ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్ రవాణా చేసే విషయంలో ఇరువర్గాలు సై అంటే సై అంటున్నాయి. అసలు ఏం జరుగుతోంది.
జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఆర్టీపీసీ నుంచి ఫ్లై యాష్ ను తాడిపత్రికి తరలింపు విషయంలో జేసీ బ్రదర్స్...జమ్మల మడుగు ఎమ్మెల్యే అది వర్గాల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. రెండు రోజులుగా ఈ వ్యవహారంలో చర్చలు నడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. రెండు వర్గాలు తమ బలం చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజా గా తాడిపత్రి నుంచి జేసీ మద్దతుదారులు మళ్లీ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అనంతపురం - కడప జిల్లా సరిహద్దు వద్ద పోలీసుల బలగాలను మొహరించారు. జేసీ - ఆదినారాయణ రెడ్డి ఇద్దరూ కూటమిలో కీలక నేతలుగా ఉన్నారు.

ఆర్టీపీపీ ఫ్లై యాష్ తరలింపు విషయం పైన ఒప్పందంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆర్టీపీపీ జమ్మలమడుగు పరిధిలోకి వస్తుంది. తమ నియోజకవర్గంలో జరిగే పనులు తమ ఆధీనంలోనే ఉండాలని ఎమ్మెల్యే ఆదినారాయణ పట్టు బడుతున్నారు. కానీ, తాడిపత్రి నియోజక వర్గంలోని సిమెంట్ ఇండస్ట్రీకి ఆర్టీపీపీనుంచి వర్గీయులు ఫ్లై యాష్ ను తరలిస్తున్నారు. దీని పైన ఇద్దరి పైన ఒప్పందం కుదరకపోవటం తాజా వివాదానికి కారణంగా నిలుస్తోంది. జేసీ వాహనాలను ఆర్టీపీపీ వద్దకు రానీయమంటూ ఆదినారాయణ రెడ్డి మద్దతు దారులు పంతంతో వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో జేసీ వాహనాలు ఆర్టీపీపీకి వస్తున్నాయని తెలిసి.. ఆది మద్దతు దారులు ఆర్టీపీసీ సమీపంలో భారీగా మొహరించారు.
తమ నియోజకవర్గ పరిధిలోని ఆర్టీపీపీ ఫ్లై యాష్ కావటంతో తమ వాహనాలతో తరలిస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మద్దతు దారులు పట్టు బడుతున్నారు. కానీ, తరలించేది తమ నియోజకవర్గానికి కావటంతో తమ వాహనాల్లోనే తరలిస్తామనేది జేసీ వర్గీయుల పంతం. దీంతో, ఇద్దరి మధ్య ఈ వివాదం ప్రతిష్ఠగా మారింది. దీంతో..ఇద్దరూ వెనక్కు తగ్గటం లేదు. ఇద్దరి మద్దతు దారులు తమ నేతలకు మద్దతుగా తరలి వచ్చేందుకు సిద్దంగా ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు మొదలు పెట్టారు. ఈ వివాదం కూటమి ప్రభుత్వంలోనూ చర్చగా మారింది. దీనికి పరిష్కారం ఎలా చూపిస్తారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications