పాకిస్థాన్ 'డ్రోన్ వార్'.. లక్ష టర్కిష్ FPV డ్రోన్ లతో.. భారత్ అలర్ట్.. ఏం జరుగుతోంది..?
పాకిస్థాన్ లో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు గణనీయంగా పెరుగుతోంది. నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రజల అవసరాలు తీర్చకుండా అక్కడి ప్రభుత్వం రక్షణ ఉత్పత్తులను సమకూర్చుకునే పనిలో పడింది.
భారత్ తో పాటు అఫ్గానిస్తాన్ తో ముప్పు ఉన్నట్లు భావిస్తున్న ఆ దేశం.. తన మిత్ర దేశం టర్కీ నుంచి భారీగా మోడ్రన్ డ్రోన్ లను కొనుగోలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లక్ష మెర్కుల్ ఫస్ట్ పర్సన్ వ్యూ(FPV) టర్కిష్ డ్రోన్ లను టర్కీ నుంచి పాకిస్థాన్ ఆర్డర్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది. టర్కిష్ డిఫెన్స్ కంపెనీ అయిన పసిఫిక్ టెక్నాలజీ ఈ డ్రోన్ లను ఉత్పత్తి చేస్తోంది.
పాకిస్థాన్ కు చెందిన ఎన్ఆర్టీసీ సంస్థతో మూడేళ్ల ఒప్పందంలో భాగంగా పసిఫిక్ టెక్నాలజీ సంస్థ లక్ష FPV డ్రోన్ లను పాకిస్థాన్ కు చేరవేయనున్నట్లు సమాచారం. వీటితోపాటు 10 ఆల్ పిన్ అన్ మ్యాన్డ్ హెలికాప్టర్స్.. 25 డమ్ రుల్ మినీ హెలికాప్టర్లు.. 500 డెలి లాయిటెరింగ్ మునిషన్స్.. 250 కోర్గాన్ గ్రౌండ్ సిస్టమ్స్ ను పాకిస్థాన్ ఆర్మీ కోసం అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఆయుధాల ఉత్పత్తి, అసెంబ్లింగ్ కు సంబంధించిన టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ ను కూడా చేయనుంది టర్కీ కంపెనీ. ఇక టర్కీ నుంచి వచ్చే ఈ ఆయుధాలతో పాకిస్థాన్ ఆర్మీ మరింత శక్తివంతంగా మారుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ క్రమంలో భారత్.. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సరిహద్దులో బలగాలను ఎప్పటికప్పుడు మోహరిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇక గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనకాల పాకిస్థాన్ ఉన్నట్లు గ్రహించిన భారత్.. ఆ దేశంపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు చేపట్టి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ పాకిస్థాన్ కు టర్కీ ఆయుధాలను సరఫరా చేసి సాయం చేసింది. కానీ వాటిని భారత్ కు చెందిన ఎస్-400 ఆయుధ వ్యవస్థ సమర్థవంతంగా నేలకూల్చింది.












Click it and Unblock the Notifications
