నీకూ భార్యా, పిల్లలున్నారు.. లోకేష్ ఖబడ్దార్: జోగి రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఉత్కంఠగా మారింది. కల్తీమద్యం తయారీ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ ను ఈరోజు తెల్లవారుజామున విజయవాడ ఇబ్రహీంపట్నంలో గల ఆయన ఇంటికి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు, పోలీసులు నోటీసు ఇచ్చిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రమేష్
జోగి రమేష్ అరెస్టుతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో జోగి రమేష్ సంచలన కామెంట్స్ చేశారు.

ప్రమాణం చేసి చెప్పానన్న జోగి రమేష్
తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య బిడ్డల సాక్షిగా తనకు ఈ నకిలీ మద్యం తయారీ కేసులో ఎటువంటి ప్రమేయం లేదని ప్రమాణం చేసి చెప్పానని, కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేశానని జోగి రమేష్ పేర్కొన్నారు.
లోకేష్ కు జోగి రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్
అయినప్పటికీ సీఎం చంద్రబాబు తన రాక్షసానందం కోసం తనను అరెస్టు చేశారని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్ట అంటూ జోగి రమేష్ విమర్శలు గుప్పించారు. ఇక ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ కు జోగి రమేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లోకేష్ ఖబడ్దార్ అంటూ పేర్కొన్న జోగి రమేష్ నీకు భార్య పిల్లలు ఉన్నారు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
జోగి రమేష్ అరెస్ట్ తో ఏం జరగబోతుంది.. ఉత్కంఠ
కాగా నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్ ను అరెస్ట్ చేసి విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. జోగి రమేష్ అరెస్టుతో వైసిపి శ్రేణులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ కేసులో జోగి రమేష్ అరెస్ట్ తో ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications