నారా లోకేష్‌ను నీడలా వెంటాడుతున్నారు..!!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 191వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలో పాదయాత్రను పూర్తి చేసుకున్నారాయన. గన్నవరం నియోజకవర్గంలో అడుగు పెట్టారు. అక్కడ భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.
ఇదంతా ఒక ఎత్తయితే.. అదే పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లు ఏర్పాటు కావడం మరో ఎత్తు. తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ భయం.. నీడలా వెంటాడుతూనే వస్తోందనడానికి తాజా ఉదాహరణ ఇది. జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలను అప్పగించానే డిమాండ్ ఊపందుకుంటోన్న నేపథ్యంలో ఏకంగా పాదయాత్రలోనే ఈ ఫ్లెక్సీలు కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గతంలో ఇలాంటి చాలా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలను అప్పగించాలంటూ సాక్షాత్తూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో సైతం డిమాండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సమక్షంలోనే ఎన్టీఆర్‌కు అనుకూలంగా కుప్పం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసిన రోజులు ఉన్నాయి.
ఇదే ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కంచికచర్ల మండలం పరిటాలలో గతంలో టీడీపీ నిర్వహించిన రైతు పోరు సభలో కూడా జూనియర్ జెండాలు ఎగిరాయి. ఫ్లెక్సీలు వెలిశాయి. ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలను అప్పగించాలంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు స్వయంగా జూనియర్ ఫొటోలు ముద్రించివున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను ప్రదర్శించారు.
అదే పరిస్థితి ఇప్పుడు గన్నవరంలోనూ టీడీపీకి ఎదురైంది. యువగళమైనా, జనగళమైనా, నవగళమైనా, ఏ గళమైనా, తెలుగునాట స్మరించే పేరు ఒక్కటే.. నందమూరి తారకరామారావు.. ఎన్టీఆర్ ఫ్యూచర్ సీఎం అనే భారీ బ్యానర్‌కు ఆయన అభిమానులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. మీసం మెలేస్తోన్న జూనియర్, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, హరికృష్ణ ఫొటోలను ముద్రించారు.












Click it and Unblock the Notifications