ఏపీ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్..: సుప్రీం కొలీజియం గ్రీన్ సిగ్నల్
సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గురువారం రాత్రి జరిగిన కొలీజియం సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఈ ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. దీనిపై కేంద్రం ఆమోదం తెలపడం మిగిలివుంది. విభజన అనంతరం ఏపీ హైకోర్టుకు ఆమె తొలి ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.
ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఏర్పడే ఆ ఖాళీని జస్టిస్ లిసా గిల్‌తో భర్తీ చేయాలని కొలీజియం నిర్ణయించింది. ఆమెకు పదోన్నతి కల్పించి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానిక సూచించింది. ఆ ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఆమెను ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని తీర్మానించింది.

కేంద్ర ఆమోదం లభించిన తర్వాత అంటే.. ఏప్రిల్ 25న పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా పీఠాన్ని అధిరోహిస్తారు లిసా గిల్. జస్టిస్ గిల్‌ను ముందుగానే బదిలీ చేయాలన్న ఈ నిర్ణయం కొలీజియం కొత్తగా ప్రకటించిన విధానానికి అనుగుణంగా ఉంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే న్యాయమూర్తిని.. ఖాళీ ఏర్పడటానికి కనీసం రెండు నెలల ముందుగానే బదిలీ చేయాలని కొలీజియం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.
దీనివల్ల కాబోయే ప్రధాన న్యాయమూర్తి అధికారికంగా బాధ్యతలు స్వీకరించే ముందు హైకోర్టు పనితీరు, పరిపాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. జస్టిస్ లిసా గిల్ పంజాబ్ విశ్వవిద్యాలయం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాస్ పూర్వ విద్యార్థిని. ఆమె అక్కడే బీఏ ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. అనంతరం ఎల్ఎల్ఎమ్ లో పట్టా పొందారు.
ఆమె 1990లో న్యాయవాద వృత్తిలో అడుగు పెట్టారు. పంజాబ్ హర్యానా హైకోర్టులో దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన అనేక రకాల కేసులలో విస్తృత అనుభవాన్ని సంపాదించారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి, కొన్ని బోర్డులు, కార్పొరేషన్లకు చాలా సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు. ఆమె 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు పదోన్నతి పొందారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రానున్నారు.












Click it and Unblock the Notifications