చేరకముందే టిడిపిలో నెహ్రూ యాక్టివ్, మీ కోరిక ప్రకారం సీఎం అవుతా!: జగన్
రాజమహేంద్రవరం/కడప: తెలుగుదేశం పార్టీలో చేరకముందే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ తరఫున యాక్టివ్‌గా పని చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జ్యోతుల వైసిపి నుంచి గెలుపొందారు. ఇటీవలే ఆయన టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్‌పై అసంతృప్తితో ఆయన సైకిల్ ఎక్కుతున్నారు.
ఈ నెల 11వ తేదీన జ్యోతుల తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టిడిపిలో చేరనున్నప్పటికీ.. ఇంకా ఆయన చేరలేదు. అయినప్పటికీ ఆయన విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం నాడు ప్రత్యక్షమయ్యారు.
కాపు కార్పొరేషన్ పైన సమీక్ష కోసం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు పలువురు కాపు నేతలు హాజరయ్యారు. ఆ సమయంలో జ్యోతుల నెహ్రూ కూడా వచ్చారు. అందరితో పాటే జ్యోతుల కూడా సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. గంటల తరబడి సమావేశంలో ఆయన ఉన్నారు.

సమావేశంలో కీలక భూమిక పోషించినట్లుగా తెలుస్తోంది. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా పలు విషయాలపై చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఆయన ఇంకా పార్టీలో చేరకుండానే క్రియాశీలకంగా మారారని చెప్పవచ్చు.
సీఎం కల నెరవేరుతుంది!: జగన్
వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రెండు రోజులుగా సొంత జిల్లా కడపలో ఉన్నారు. తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలు, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
తనను కలిసేందుకు వచ్చిన మహిళలతో జగన్ మాట కలిపారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు... సార్, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. దానికి జగన్ స్పందిస్తూ... మీ కోరిక నెవరేరుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications