‘‘మీకూ, మీ పార్టీకి ఓ దండం’’: ఇక ఉండలేనంటూ జగన్‌కు చెప్పనున్న జ్యోతుల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మళ్లీ ఊపందుకున్నాయి. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఫేజ్-2లో భాగంగా వైసీపీలో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పార్టీలో కీలక నేత, శాసనసభలో ఆ పార్టీ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ పార్టీని వీడనున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.
పార్టీ మారేందుకు నిర్ణయించుకున్న జ్యోతుల ఆ విషయాన్ని నేరుగా పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ముఖం మీదే చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంతూరు ఇర్రిపాక నుంచి హైదరాబాదుకు చేరుకున్న నెహ్రూ సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోని పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా వైసీపీలో తనకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యవసానాలను జగన్ ఎదటు ఏకరువు పెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని, పార్టీలో ఉండలేనని తేల్చిచెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జ్యోతుల పార్టీ మారుతున్నారంటూ మీడియాలో వార్తలు రాగానే వైసీపీ నేతలు ఆయనకు నచ్చజెప్పేందుకు చేసిన యత్నాలేమీ ఫలించలేదు.

తనకు సర్దిచెప్పేందుకు వచ్చిన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఝలకిచ్చిన జ్యోతుల... ఇక మాట్లాడేదేమీ లేదు, ఏదైనా జగన్ తోనే నేరుగా మాట్లాడతానని ముఖం మీదే చెప్పేశారు. అంతకుముందు జగన్ శిబిరంలో మరో కీలక నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కూడా మర్రిపాకలో జ్యోతులను కలిసి కొద్దిసేపు మాట్లాడారు.
ఇక... ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయలు దేరిన జ్యోతులను రాజమండ్రి విమానాశ్రయంలో పలువురు నేతలు కలిశారు. జగన్ తరఫున విజయసాయి రెడ్డి అంతకుముందే జ్యోతులతో మాట్లాడారు. ఈ సమయంలో జ్యోతుల వేసిన పలు ప్రశ్నలకు 'ఔను... నిజమే' అని స్పందించడం తప్ప, పార్టీ విధివిధానాలు గురించి స్పష్టత ఇవ్వలేకపోయారని తెలిసింది.
''పార్టీ నిర్ణయమే అంతిమం కావచ్చు. కానీ, ఏదైనా ప్రజాస్వామ్య విధానంలో జరగాలి. రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించి.. మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలని ఎప్పటి నుంచో చెబుతన్నాను. ఏనాడైనా దీనిని అమలు చేశారా?'' అని జ్యోతుల ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికీ విజయసాయి నుంచి సమాధానం కరువైనట్లు తెలిసింది.
జ్యోతుల సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు కూడా ఆయనతో చర్చలు జరిపారు. ''బలమైన సామాజికవర్గానికి అన్యాయం జరుగుతుంటే జగన్‌ను ఎందుకు ప్రశ్నించలేదు?'' అని జ్యోతుల వారిని నిలదీసినట్లు తెలిసింది. జగన్‌తో భేటీ ముగియగానే తన తోడల్లుడు, మరో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతో కలిసి నేరుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో సమావేశం కానున్నట్లు సమాచారం.
''మీకూ, మీ పార్టీకి ఓ దండం'' అంటూ జ్యోతుల చెప్పనున్న మాటకు జగన్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి. అంతేకాదు ఏప్రిల్ 8వ తేదీన టీడీపీలో చేరనున్నట్లు జ్యోతుల ఈరోజే ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న రాజకీయ నిపుణులు అంటున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న జ్యోతుల నెహ్రూ ఆర్ధిక మంత్రి యనమలను కలిసి తనతో పాటు మరో ఇద్దరు టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications