జగన్ నమ్మరు: చంద్రబాబు పాలనపై నెహ్రూ షాకింగ్ కామెంట్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడిన జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో వైయస్ జగన్‌పైనే కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన చుట్టూ ఉన్నవారిని నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
జగన్ తన చుట్టు ఉన్నవారిని నమ్మి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేదని కాదని ఆయన అన్నారు. అదే సమయంలో చంద్రబాబు పాలనపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలన టిడిపి నేతలు చెబుతున్నంత గొప్పగా ఏమీ లేదని అన్నారు. అలాగని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపించినంత దారుణంగా కూడా ఏమీ లేదని అన్నారు.

చంద్రబాబు పరిణతి చెందిన ఫక్తు రాజకీయ నేత కాగా, జగన్ పరిపక్వత లేని అరుదైన రాజకీయ నాయకుడని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ అలాగే ఉంటారని, జగన్‌లో పరిపక్వత లేకపోవడం వల్లనే తాను కలిసి పనిచేయలేకపోయానని చెప్పారు.
పైగా తనది ముక్కుసూటి తత్త్వమని, ఏదైనా ముఖం మీదే అడిగేస్తానని, ఈ విషయంలో చంద్రబాబు తప్పు చేసినా ఆయన్ను కూడా ఎదురుగానే విమర్శిస్తానని చెప్పారు. తనది అవకాశవాద రాజకీయం కాదని, ఆశావాద రాజకీయమని చెప్పారు.
యనమల రామకృష్ణుడితో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే యనమల ఆహ్వానం మీదనే తాను టిడిపిలో చేరుతున్నానని చెప్పారు. ప్రత్యర్థి ఎన్ని విమర్శలు చేసినా జగన్ నవ్వుతూ వాటిని తేలిగ్గా తీసుకుంటారని చెప్పారు. కానీ సొంత నేతలు ఏదన్నా అంటే జగన్ ఏ మాత్రం జీర్ణించుకోలేరని చెప్పారు.












Click it and Unblock the Notifications