YS Avinash Reddy : సుప్రీంకోర్టుకు అవినాష్ రెడ్డి-హైకోర్టుకు ఆదేశాలిమ్మంటూ..
ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా చేర్చిన సీబీఐ.. వారిలో ఆరుగురిని అరెస్టు చేసింది. మరో నిందితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా రేపో మాపో అరెస్టు చేసేందుకు సిద్దమవుతోంది. మరోవైపు సీబీఐ అరెస్టు అవకాశం నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఎటూ తేల్చలేదు.
తెలంగాణ హైకోర్టులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసిన నేపథ్యంలో సీబీఐ దూకుడుతో వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అవినాష్ కు ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలే కీలకంగా మారాయి. అయితే వేసవి సెలవులకు ముందు ఈ వ్యవహారం తేల్చేందుకు తెలంగాణ హైకోర్టు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ఈ నేపథ్యంలో ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ (తాత్కాలిక బెంచ్) తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ చేపట్టబోతోంది. అవినాష్ అభ్యర్ధనపై సుప్రీంకోర్టు కూడా తిరిగి పిటిషనర్ అయిన వివేకా కుమార్తె తో పాటు దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐ వాదనలు కూడా వినాల్సి ఉంటుంది.
మరోవైపు సీబీఐ నిన్న విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు పంపింది. అయితే ఇంత తక్కువ సమయంలో నోటీసులు ఇస్తే రాలేనంటూ ఆయన సీబీఐకి లేఖ రాశారు. తనకు 4 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. అయితే సీబీఐ మాత్రం 3 రోజులు సమయం ఇచ్చి 19న విచారణకు రావాలని సూచించింది. ఈ మేరకు పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో హైదరాబాద్ లో అవినాష్ రెడ్డి ముగ్గురు అనుచరుల్ని సీబీఐ నిన్న విచారించింది. అలాగే వివేకా కుమార్తె, అల్లుడు సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డిని సైతం విచారించింది.












Click it and Unblock the Notifications