ఆ మామిడి పండు అక్షరాలా లక్ష రూపాయలు-వీఐపీలకే అమ్మకం-కాకినాడ రైతు రికార్డు
గోదావరి జిల్లాల్లో దొరికే పులస చేపకు ఓ ప్రత్యేకత ఉంది. నదీ సంగమంలో మాత్రమే దొరికే ఈ చేపను ఎంత ధరైనా పెట్టి కొనే జనం ఇక్కడ మాత్రమే కనిపిస్తారు. తింటే పులస తినాలన్న సామెత కూడా అక్కడ తరచూ వినిపిస్తుంటుంది. అయితే ఇదే జిల్లాలో ఇప్పుడు రికార్డు స్ధాయిలో మామిడి పండ్లూ అమ్ముడవుతున్నాయి. అయితే పులస చేపలా ఇవి సామాన్యుడికి మాత్రం అందుబాటులో లేవు. కేవలం వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మామిడి పండ్ల ప్రత్యేకత అందరూ తెలుసుకోవాల్సిందే.

లక్ష రూపాయల మామిడిపండు
ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. ఈ కాలంలో లభించే సీజనల్ పండు మామిడి. ఏపీలో మామిడి పండ్లు పరక లేదా డజన్ల రూపంలో అమ్మకాలు సాగుతుంటాయి. పరక అయినా డజను అయినా గరిష్టంగా ఓ వెయ్యిరూపాయలు గరిష్ట ధర పలుకుతుంది. అంతకు మించి అయితే నూజివీడు ఎక్స్ పోర్ట్ క్వాలిటీ మామిడి పండ్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ ఏకంగా ఒక్కో మామిడి పండూ లక్షరూపాయలు పలకడం ఎక్కడైనా చూశామా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. కానీ కాకినాడ జిల్లాలో మాత్రం ఓ రైతు ఇంత భారీ రేటు పలికే మామిడి పండ్లను సాగుచేస్తున్నాడు.

జపాన్ మియాజాకీ రకం
జపాన్ దేశానికి చెందిన "మియాజాకీ" అనే జాతికి చెందిన మామిడిపండ్లు మన దేశంలో లక్షలరూపాయల్లో ధర పలుకుతోంది. దీంత కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు తన పొలంలో ఈ మియాజాకీ జాతికి చెందిన మామిడిపండ్లు పండిస్తున్నారు.ఈ మామిడి విత్తనాన్ని జపాన్ దేశంనుండి తీసుకొచ్చినట్లు రైతు ఓదూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సీజన్ లో పంట చేతికి కూడా వచ్చింది.

మియాజాకీ పండ్ల ప్రత్యేకత ఇదే
ఈ మియాజాకీ రకం మామిడిపండులో పోషకవిలువలు చాలా అధికంగా ఉంటాయని,ఒక్కో పండు మూడునుంచి నాలుగొందల గ్రాముల బరువు ఉంటుందని,అందుకే ఈ మధురఫలానికి ప్రంపంచమార్కెట్లో కిలో రెండున్నర లక్షల రూపాయలవరకూ ధర ఉందని నాగేశ్వరరావు తెలిపారు. ఇవే కాకుండా నాలుగెకరాల పొలంలో ప్రపంచంలో ఉన్న వివిధరకాల మామిడిపండ్లను తాను,తన కుమారుడు కిశోర్ కలిసి,స్వయంగా పండిస్తున్నామన్నారు.ఇందులో టెంకలేని మామిడి,యాపిల్ మామిడి,పలురకాల మామిడిపండ్లు, అలాగే.,తెల్ల నేరేడుపండు కూడా తమ పొలంలో పండిస్తున్నామన్నారు.ప్రపంచంలో ఉన్న అన్ని మామిడిరకాలు తన పొలంలో పండించే విధంగా కృషిచేస్తున్నట్లు రైతు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిశోర్ తెలియజేశారు.

వీఐపీలకు మాత్రమే
ఇంత అరుదుగా లభించే, ఇంత భారీ ఎత్తున ధర పలితే మియాజాకీ మామిడి పండ్లను పండిస్తున్న రైతు.. వీటిని మాత్రం సాధారణ ప్రజలకు విక్రయించే పరిస్ధితి లేకపోవడంతో కేవలం వీఐపీలను మాత్రమే నమ్ముకున్నాడు.
ఇంత ఖరీదైన మామిడిపండ్లను విక్రయించడానికైతే కాదని ,వీఐపీలకు మాత్రమే అందిస్తానని రైతు నాగేశ్వరరావు చెప్తున్నాడు. దీంతో కాకినాడతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వీఐపీలకు ఈ అరుదైన మియాజాకీ మామిడి పండ్లను పంపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications