కేసీఆర్ ఆ పని చేస్తున్నా జగన్ సైలెంట్: కన్నా లక్ష్మీనారాయణ!!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణా, ఏపీ మధ్య నీళ్ళ పంచాయితీపై రగడ కొనసాగుతుంది. గత కొంత కాలంగా తెలంగాణా నీళ్ళను అదనంగా వాడుకుంటున్నా జగన్ సైలెంట్ గా ఉంటున్నారని ప్రతిపక్షాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో రెండు రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా జగన్ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్జీ రంగా 123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్ లో ఆయన విగ్రహం వద్ద టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేసీఆర్ కు అమ్మేద్దామని చూస్తున్నారని, జగన్ ఏపీని నాశనం చేసే దాకా నిద్రపోరని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

2019 ఎన్నికల్లో జగన్ ప్రజలను మోసం చేసి గెలిచారని అన్నారు . ఆ తరువాత రాష్ట్రాన్ని మోసం చేసిన విషయాన్ని ప్రజలు గమనించారనే ఓటర్ల జాబితాలో మార్పులు చేసి గెలవాలని చూస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఏపీలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలు తమ ఓటును కాపాడుకోవటం చాలా అవసరం అని, తద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
ఇదే సమయంలో ఏపీ, తెలంగాణా నీళ్ళ పంపకం వ్యవహారాన్ని ప్రస్తావించిన ఆయన నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా గత 40 రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి నీరు వెళుతున్నా జగన్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే హైదరాబాదులో ఉన్న ఏపీ ఆస్తులను పోగొట్టారని, ఇప్పుడు ఇంతా జరుగుతున్నప్పటికీ జగన్ సైలెంట్ గా ఉన్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు.
ఈసారి సీఎం జగన్ రాష్ట్రాన్ని కెసిఆర్ కు అమ్మేద్దాం అని చూస్తున్నారని టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అందుకే జగన్ కేసీఆర్ ఏం చేస్తున్నా మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సాగర్ నీళ్ళ విషయంలో జగన్ దృష్టి సారించాలని కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications