స్వర్గాన్ని తలపిస్తోన్న కలియుగ వైకుంఠం: భారీ వర్షాలతో సప్తగిరులకు కొత్త శోభ
తిరుపతి: శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. స్వర్గాన్ని తలపిస్తోంది. జలసవ్వడితో సప్తగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీమన్నారాయణుడి నామస్మరణకు అవి తోడయ్యాయి. శేషాచలం అడవులు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. మంచుతెరలను కప్పుకొన్న తిరుమల శిఖరాలు సాక్షాత్ స్వర్గాన్ని తలపిస్తోన్నాయి. భారీ వర్షాల వల్ల కపిలతీర్థం, మాల్వాడిగుండం జలపాతాలు ఉరకలు వేస్తోన్నాయి. శ్రీవారి భక్తుల నీటి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన నీటి ప్రాజెక్టులు గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. తిరుమలలో ఏ ప్రాజెక్టు కూడా ఖాళీగా లేదు. అన్నీ జలకళను సంతరించుకున్నాయి.

మరిన్ని భారీ వర్షాలు..
రెండు, మూడు రోజులుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నంచి అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. మరో మూడురోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొని ఉండొచ్చంటూ భారత వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న వాతావరణం మరి కొన్నిరోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

నీటి ప్రాజెక్టులు ఫుల్..
ఇదివరకే పడిన వర్షాలతో తిరుమలలోని నీటి ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో విడత కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. ఆకాశగంగ, గోగర్భం, పాపవినాశనం, కుమారధార, పసుపుధార ప్రాజెక్టులు పూర్తిగా గరిష్ఠస్థాయి నీటి మట్టాన్ని అందుకున్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు, తిరుపతి ప్రజలకు ఇంకో రెండేళ్ల వరకూ ఎలాంటి నీటి ఎద్దడి ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

గేట్ల ఎత్తివేత..
పాపవినాశనం పూర్తిస్థాయి నీటి మట్టం-5,240 లక్షల గ్యాలన్లు. కుమారధార-4,258.98, గోగర్భం-2,833, పసుపుధార-1,287.51, ఆకాశగంగ-685 లక్షల గ్యాలన్ల నీటి మట్టాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో పాపవినాశనం, గోగర్భం రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో వాటి గేట్లను టీటీడీ అధికారులు ఎత్తేశారు. వరదనీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

నారాయణుడి నామస్మరణకు తోడుగా..
కాగా- భారీ వర్షాలతో సప్తగిరులు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఎటు చూసినా పచ్చదనంతో తిరుమల కళకళలాడుతోంది. శిలాతోరణం, ఆకాశగంగ వైపు వెళ్లే మార్గాలన్నీ నయనానందాన్ని కలిగిస్తున్నాయి. ఎత్తయిన పర్వతాల నుంచి కిందికి ఉరకలు వేస్తోన్న జలపాతాల సవ్వడులు తిరుమలగిరుల్లో మార్మోగుతున్నాయి. నారాయణుడి నామస్మరణకు తోడయ్యాయి. కపిలతీర్థం జలపాతాన్ని తిలకించడానికి ప్రజలు గుమికూడుతున్నారు.
మాల్వాడిగుండం కనువిందు..
కపిలతీర్థంతో పాటు మాల్వాడి గుండం జలపాతం సరికొత్త అందాలను పుణికిపుచ్చుకుంది. మాల్వాడి గుండం వాటర్‌ఫాల్ ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుమల కొండ మీదున్న జలాశయాల్లో సమృద్ధిగా నీరు చేరింది. తిరుమతి సమీపంలోని కల్యాణి డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లను ఎత్తేశారు అధికారులు. దిగువకు నీటిని వదులుతున్నారు. కల్యాణి రిజర్వాయర్ దిగువ ప్రాంతాలకు ఇదివరకే హెచ్చరికలను జారీ చేశారు.












Click it and Unblock the Notifications