ముద్రగడ ఎఫెక్ట్: చిరంజీవి, దాసరి సమక్షంలో 'మీడియా' ఆలోచన
హైదరాబాద్: ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో సోమవారం హైదరాబాదులో భేటీ అయిన కాపు నేతలు పలు అంశాల పైన చర్చించారు. అదే సమయంలో మీడియా విషయమై కూడా చర్చించారని తెలుస్తోంది. మనకూ ఓ మీడియా ఉంటే బాగుంటుందని పలువురు ఈ సందర్భంగా సూచన చేసినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో ప్రతి రాజకీయ పార్టీకి మీడియా అవసరం ఏర్పడింది. అంతేకాదు, సొంతగా మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. కొన్ని పార్టీలకు మీడియా లేకున్నప్పటికీ... అనుకూల మీడియా ఉంది. అయితే, ఇప్పుడు కాపు నేతలు తమకు సొంతగా మీడియా ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారని చెబుతున్నారు.
నిన్నటి దాకా కాపు ఉద్యమం గురించి కొన్ని మీడియా సంస్థలు పెద్దగా స్పందించలేదని, ఇప్పుడు చిరంజీవి, దాసరి నారాయణ రావు వంటి పెద్దలు రంగంలోకి దిగినందున ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, ముద్రగడకు మద్దతు పలుకుతున్న సాక్షి ప్రసారాలను నిలిపేశారు.

కాపు ఉద్యమానికి సంబందించిన వార్తలను ఇప్పుడు ఇచ్చిన వాటి కంటే ఎక్కువ కవరేజీ ఉండాలని చాలామంది అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. కాబట్టి, మనకూ మీడియా ఉండాలని కొందరు చెప్పారని తెలుస్తోంది.
గతంలో దాసరి నారాయణ రావు దిపత్రికను నిర్వహించారు. ఇటీవల దాసరి మరోసారి ఉదయంను తీసుకు వస్తారనే వార్తలు వచ్చాయి. వైసిపి నేత బొత్స సత్యనారాయణ ఓ ఛానల్‌ను కొన్నప్పటికీ, ఆ తర్వాత దూరం జరిగారు. పవన్ కళ్యాణ్, చిరంజీవిలు కూడా మీడియా ఆలోచన చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇప్పుడు కాపు ఉద్యమం నేపథ్యంలో మరోసారి కాపు నేతల్లో మీడియా ఆలోచన మొలకెత్తింది. న్యూస్ చానెల్ లేదా ప్రింట్ మీడియా ఏదైనా.. నిర్వహణ భారం కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే ఆలోచన కూడా చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications