కర్నాటక ఫలితాల ఎఫెక్ట్- ఏపీ రాజకీయంలో అనూహ్య మార్పులు ?
కర్నాటకలో తాజాగా కాంగ్రెస్ సాధించిన గెలుపు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాల్ని మార్చేలా కనిపిస్తోంది. అప్పటివరకూ తమను తాము అజేయంగా భావించిన బీజేపీకి కర్నాటక ఎన్నికలు ఇచ్చిన షాక్ తో ఇప్పుడు ఆ పార్టీ ప్రత్యర్ధులే కాదు, మిత్రపక్షాలు కూడా వ్యూహాలు మార్చుకుంటున్నాయి. అదే తరహాలో బీజేపీతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకుందామని భావించిన పార్టీలు కూడా ఆలోచనలో పడుతున్నాయి. దీంతో కాషాయ పార్టీ అప్రమత్తమవుతోంది.
కర్నాటక ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో పాటు అధికారం కోసంప్రయత్నిస్తున్న బీజేపీ కూడా కర్నాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై పడకుండా చూసుకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం కర్నాటక ఫలితాల్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా తెలంగాణలో తామూ పోటీలో ఉన్నామనే విషయాన్ని గుర్తుచేస్తోంది.

ఇటు ఏపీలోనూ కర్నాటక ఫలితాల తర్వాత పొత్తుల రాజకీయం రసకందాయంలో పడింది. ముఖ్యంగా అప్పటివరకూ బీజేపీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు సైలెంట్ అయిపోతున్నారు. అంతే కాదు ఆయన పార్టీ నేతలు కూడా బీజేపీతో పొత్తు గురించి మాట్లాడటం తగ్గించేశారు. భవిష్యత్తులో పరిస్ధితులు మారితే అప్పుడు బీజేపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావించాలని కోరుకుంటున్నారు. దీంతో నిన్న మొన్నటివరకూ టీడీపీతో పొత్తు వద్దంటూ తిరస్కరిస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు అలర్ట్ అయ్యారు.
మూడేళ్లుగా బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీని కూడా కలుపుకుని వైసీపీపై పోరాటం చేద్దామని ప్రతిపాదిస్తుంటే పట్టించుకోలేదు. ఏకంగా ప్రధాని మోడీకి సైతం పవన్ కళ్యాణ్ ఈ ప్రతిపాదన చెప్పినా ఒప్పుకోలేదు. చివరికి కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు అధిష్టానం వద్ద పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెండింగ్ లో ఉందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. తద్వారా టీడీపీ తమను కాదని కేవలం జనసేనతోనే పొత్తు పెట్టుకుంటుందేమో అన్న భయం కాషాయ పార్టీలో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications