కాంగ్రెస్‌కు షాక్: జగన్ పార్టీలోకి మాజీ సీఎం మనవడు!
మాజీ సీఎం, దివంగత నేత కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
హైదరాబాద్: మాజీ సీఎం, దివంగత నేత కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి మహేశ్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు.
అనంతరం మహేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా తాను పార్టీలో చేరాలనుకుంటున్నట్లు వివరించారు. కలిసి పని చేద్దాం, పార్టీలోకి రండి అని వైయస్ జగన్ ఆహ్వానించారని తెలిపారు. తన తండ్రి కాసు కృష్ణారెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డితో కలిసి సుదీర్ఘకాలంపాటు ఒకే సిద్ధాంతం కోసం పోరాడారన్నారు. తాను కూడా జగన్‌తో కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చానన్నారు.

నరసరావుపేటలో డిసెంబర్ 16న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు ప్రకటించారు. కాగా, కాసు మహేశ్‌రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్లు మర్రి రాజశేఖర్ తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గలిగిన కాసు కుటుంబం వైయస్సార్‌సీపీలో చేరడం పార్టీకి రాష్ట్రంలో ఊపునిస్తుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అందరం కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
మహేశ్ చేరిక జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి తోడ్పడుతుందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కలిసి మెలిసి పని చేయడానికి తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. మహేశ్‌రెడ్డి చేరికను ఆహ్వానిస్తున్నట్లు జంగా కృష్ణమూర్తి చెప్పారు. కాగా, మహేశ్‌రెడ్డి 2004 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications