పవన్‌కు కవిత చురక, వారి కథ సీరియల్‌గా తీస్తే: రేణుక
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు మేకప్... ఎన్నికల తర్వాత పేకప్ అంటూ చురకలు అంటించారు. పేద ప్రజల గురించి తెలిసిన వారు ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ ప్రకటన చేయరన్నారు.
కొత్త వేషాలు వేసుకొని వచ్చే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలోకి రావాలని డిమాండ్ చేశారు. తనకు విప్లవం అంటే ఇష్టమని చెప్పిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో ఎలా కలుస్తారన్నారు. గద్దర్ అంటే ఇష్టమని చెబుతూనే.. అదే గద్దర్ పైన బుల్లెట్లు కురిపించిన చంద్రబాబుకు మద్దతు పలుకుతారన్నారు. హైదరాబాదు నుండి అహ్మదాబాదు వెళ్లే ఫ్లైట్లు సినీ తారలతో నిండిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

కెసిఆర్‌పై రేణుకా చౌదరి
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి రేణుకా చౌదరి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన వేరుగా విరుచుకుపడ్డారు. కెసిఆర్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని... ఆయనకు గుణపాఠం నేర్పేలా తెలంగాణలో 16 ఎంపీ సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని అన్నారు. తెలంగాణలో కెసిఆర్ ఉద్ధరించేది ఏమీ లేదన్నారు.
ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలని తాను గతంలోనే సూచించానని చెప్పారు. కొంతమంది నేతలకు వారు గెలవలేరని తెలిసినా టికెట్లు కోరుతున్నారని అలాంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబు, కెసిఆర్‌లు కథలు చెబుతున్నారని, వారి కథలను సీరియళ్లుగా తీస్తే పార్టీలకు బోలెడంత ఫండ్ వస్తుందని ఎద్దేవా చేశారు. తాను రాజ్యసభ ఎంపీనైనా ఖమ్మం జిల్లాకే ఎక్కువ నిధులు కేటాయిస్తానన్నారు.












Click it and Unblock the Notifications