కావూరిపై జగన్ పార్టీ కోడిగుడ్లు: అవిశ్వాసంపై వివరణ
ఏలూరు/హైదరాబాద్: కేంద్ర జౌళీశాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివ రావుకు మంగళవారం సమైక్య సెగ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో కావూరిని పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనం పైకి కోడిగుడ్లు విసిరారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కావూరిని అడ్డుకున్న వారిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మద్దాల రాజేష్ కూడా ఉన్నారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కావూరి మాట్లాడుతూ... 371డి సవరణ జరగకుండా విభజన జరగదన్నారు. పార్టీలో పదవులు అనుభవిస్తూ అవిశ్వాసం పెట్టడం సరికాదని, అందుకే తాను మద్దతివ్వలేదని చెప్పారు. రాష్ట్ర విభజన జరగకుండా తాను ప్రయత్నిస్తానన్నారు.

అసెంబ్లీ ముట్టడి యత్నం
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చను అడ్డుకోవడంతో పాటు ప్రతులను చించివేసి, దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రాంత ప్రయివేటు ఉద్యోగులు మంగళవారం అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
తుకారాం గేట్ వద్ద టిడిపి, జగన్ పార్టీల జెండాల ధ్వంసం
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చను అడ్డుకోవడంతో పాటు ప్రతులను చించివేసి, దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ పలువురు తెలంగాణవాదులు హైదరాబాదులోని తుకారాం గేటు వద్ద తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల జెండాలను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications