ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఖరారు- పార్టీ తొలి యూనిట్ అదే-నెలాఖరులో ప్రారంభం?
ఏపీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ ఖరారైంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు వ్యూహరచన చేస్తున్న బీఆర్ఎస్.. పొరుగు రాష్ట్రం ఏపీలోనూ అడుగుపెట్టబోతోంది. ముందుగా ఓ కీలక విభాగాన్ని ప్రారంభించడం ద్వారా ఏపీలో బీఆర్ఎస్ అడుగు పడబోతోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిప్రకారం ఈ నెలాఖరులో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు.

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ
తెలంగాణ వేదికగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను పూర్తి చేసిన బీఆర్ఎస్ వర్గాలు.. ఇప్పుడు అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే విజయవాడలో బీఆర్ఎస్ ఏపీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసేందుకు స్ధలంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే కోవలో పార్టీ ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు వీలుగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ముందుగాపార్టీలో ఓ కీలక విభాగాన్ని ఇక్కడ ప్రారంభించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కిసాన్ సెల్ తో బీఆర్ఎస్ ఎంట్రీ?
ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన బీఆర్ఎస్.. ముందుగా కీలక విభాగం కిసాన్ సెల్ ను ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. రైతు పార్టీగా, రైతు అజెండాతో ముందుకెళ్లాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు కిసాన్ సెల్ చాలా ముఖ్యమైనది. దీంతో ముందుగా కిసాన్ సెల్ ఏర్పాటుతో పార్టీని లాంఛనంగా ఏపీలో ప్రారంభించేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కిసాన్ సెల్ లో ఏయే నేతలు ఉండాలి, ఎవరు నేతృత్వం వహించాలి, విజయవాడ కేంద్రంగా పనిచేసే కేంద్ర కార్యాలయంలోనే దీన్ని ఏర్పాటుచేయాలా అన్న దానిపై ఇప్పుడు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరులోనే దీన్ని ప్రారంభించబోతున్నారు.

ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో ఒకేసారి?
ఏపీలో ముందుగా బీఆర్ఎస్ కిసాన్ సెల్ ఏర్పాటు చేయబోతున్న కేసీఆర్.. అనంతరం వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, తెలంగాణలోనూ కిసాన్ సెల్ ప్రారంభించబోతున్నారు. తద్వారా తమ రైతు అజెండాను జనంలోకి తీసుకెళ్లేందుకు సులువుగా వీలవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కిసాన్ సెల్ విభాగాలకు సంబంధించి ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆరు రాష్ట్రాల్లో ఒకేసారి కిసాన్ సెల్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులపై, వ్యవసాయంపై తమ పార్టీ బలమైన ముద్ర వేయాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications