కెసిఆర్ హ్యాపీ: హీరో గ్రూప్ తెలంగాణకు వస్తుందా?
హైదరాబాద్: పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి చూపుతున్న ఆసక్తితో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాటా గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.
ఇటీవల రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విమాన పరికరాల తయారీ పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైటెక్స్‌లో శంకుస్థాపన చేశారు. టాటా, రుయాక్ సంస్థల జాయింట్ ప్రాజెక్టుగా ఈ పరిశ్రమ రూపకల్పన జరుగనుంది. రూ.500 కోట్ల వ్యయంతో డార్నియర్ విమాన పరికరాల పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.
హీరో గ్రూప్ కూడా తెలంగాణలో పరిశ్రమను స్థాపించే విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. హీరో గ్రూప్ వస్తే తెలంగాణ బ్రాండ్ వాల్యూ పెరుగుతుందని భావిస్తున్నారు. తాజాగా బుధవారం ఆస్ట్రేలియా కంపెనీ ఎన్ఎస్ఎల్ తెలంగాణలోని కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ముడి ఇనుము పెల్లెట్ల యూనిట్లను స్థాపించడానికి ముందుకు వచ్చింది. వేయి కోట్ల ప్రాథమిక పెట్టుబడితో ఈ యూనిట్లు ఏర్పాటవుతాయి.

ఈ నేపథ్యంలో భూసేకరణ చట్టం అమలుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కెటి రామారావు, జోగు రామన్న ఈ కమిటీలో ఉన్నారు. పరిశ్రమలకు భూసేకరణ జరిపే విషయాన్ని కూడా ఈ కమిటీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారంనాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని కాలినడకన కలియదిరుగుతూ పరిశీలించారు. సర్పంచుల నుంచి ఐఎఎస్ అధికారుల వరకు అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. కార్పోరేట్ సంస్థలు కూడా తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మేధోమథనం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, సలహాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ సమగ్రాభివృద్ధి ప్రణాళికపై చర్చించారు.












Click it and Unblock the Notifications