తుళ్లూరు భేష్, నదీతీరంలో రాజధాని ఉంటే: కేసీఆర్, అన్నీ ఆలోచించాం: బాబు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఏపీ రాజధాని అంశం పైన చర్చ సాగింది. కృష్ణానదీ తీరంలో ఉన్న తుళ్లూరును రాజధానిగా ఎంపిక చేయడం సముచిత నిర్ణయమని, వాస్తురీత్యా అక్కడే బాగుంటుందని కేసీఆర్ చెప్పారు. అందుకు చంద్రబాబు వాస్తును చూసిన తర్వాతే రాజధానిని ఎంపిక చేశామని చెప్పినట్లుగా సమాచారం.
తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న ఎంసెట్ అంశం విషయమై గవర్నర్ నరసింహన్ వీరితో చర్చించిన విషయం తెలిసిందే. గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. చెరో ఏడాది ఎంసెట్ నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు మాట్లాడుకున్నారు. నదీ తీరంలో రాజదానిని ఎంపిక చేయడం వల్ల రాష్ట్రానికి అదృష్టం కలిసి వస్తుందని మాటల సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రపంచంలో నదీ తీరాలను ఆనుకొని ఉన్న నగరాలు బాగా అభివృద్ధి చెందాయన్నారు.

రాజధాని ప్రాంతంలో కృష్ణా నది వద్ద వంతెనలను, ఆకాశ హర్మ్యాలను నిర్మించాలన్నారు. కాంగ్రెస్ నేత జానా రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణానది పక్కనే రాజధాని ఎంపిక బాగుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో ఆలోచించి రాజధానిని ఎంపిక చేశామన్నారు. ప్రపంచశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో ఇరు రాష్ట్రాల స్పీకర్లు కోడెల శివప్రసాదరావు, మధుసూదనాచారి, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్షనేత జానారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు నాయిని, హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వర రావు, ఈటెల రాజేందర్, పోచారం, కేటీఆర్, జూపల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు వచ్చారు.
ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేఎల్పీ నేత లక్ష్మణ్, గంటా చక్రపాణి, పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస గౌడ్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, వీహెచ్, రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఏపీ శాంతి భద్రతల ఏడీజీ ఆర్పీ. ఠాకూర్, లోక్‌సత్తా అధినేత జేపీ, ప్రముఖ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, పీవీ సింధు తదితరులు హాజరయ్యారు.
తేనీటి విందు ముగిసిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి రాజ్‌భవన్‌లోకి వెళ్తున్న గవర్నర్ నరసింహన్‌ను అక్కడున్న మీడియా ప్రతినిధులతో క్లుప్తంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను గణతంత్ర వేడుకలు బాగా జరిగాయని, ఏర్పాట్లు బాగున్నాయని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రెండు రాష్ట్రాలకుసంబంధించిన అంశాలపై ఏమైనా మాట్లాడుకున్నారా? అని ప్రశ్నించినప్పుడు.. అన్ని విషయాలు చర్చిస్తామని, అందరం కలిసే ఉన్నామని, మీరే చూస్తున్నారు కదా! బాగుంది, బాగానే జరుగుతోందని ఇద్దరు సీఎంలను చూపిస్తూ అన్నారు.












Click it and Unblock the Notifications