చంద్రబాబు నెత్తిన పాలుపోసిన కేసీఆర్?
చంద్రబాబునాయుడుకానీ, తెలుగుదేశం పార్టీకానీ తెలంగాణకు వ్యతిరేకమని, అది ఆంధ్రుల పార్టీ అని, చంద్రబాబు ఆంధ్రావోడు అంటూ టీఆర్ఎస్ వ్యవస్థాపకులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారం చేసేవారు. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఇదే ప్రధాన అజెండా అయింది. ఓట్లు కురిపించడంతోపాటు అధికారం చేతికందించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి బదులు భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంవల్ల తెలంగాణపై తనకున్న సెంటిమెంట్ రాజకీయాన్ని ఆయనంతట ఆయనే చిదిమేసుకున్నారనే అభిప్రాయం సీనియర్ రాజకీయవేత్తల నుంచి వ్యక్తమవుతోంది.

తెలంగాణ సెంటిమెంట్ ను చిదిమేసిన కేసీఆర్?
తన టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ అనే పదాన్ని తొలిగించి భారత అని పెట్టారు. దీనివల్ల తెలంగాణలో నిలదొక్కుకోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబుకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఆంధ్రా పార్టీ అంటూ ఈసారి ప్రచారం చేసే అవకాశం లేదు. తమ పార్టీనే తెలంగాణ కాకుండా మొత్తం దేశమంతటా విస్తరించాలని కేసీఆర్ చెబుతున్నారు. అందుకు అన్నివిధాలుగా ముందుకొచ్చే మిత్రపక్షాలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒకరకంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడటానికి ఆయనే అవకాశం కల్పించినట్లవుతోంది.

ఏపీకన్నా తెలంగాణలోనే కార్యకర్తల బలమెక్కువ
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏపీకన్నా తెలంగాణలోనే నేతలు, కార్యకర్తల బలం ఎక్కువ. బీసీలను పునాదులుగా చేసుకొని ఆ పార్టీ తెలంగాణలో నిలదొక్కుకుంది. బీసీ నేతలతోపాటు బడుగు బలహీనవర్గాల నుంచి కూడా నాయకులు పుట్టుకొచ్చారు. ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరితోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారే. ఇప్పటికీ టీడీపీకి తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో బలముంది. వాస్తవానికి ఖమ్మంలో పార్టీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ తన వ్యూహం మార్చుకుంది.

సెంటిమెంట్ ను సజీవంగా ఉంచే కేసీఆర్
చంద్రబాబు పూర్తిగా తెలంగాణపై దృష్టిపెడితే ఇబ్బందిపడతామని భావించిన కేసీఆర్ సెంటిమెంట్‌ను సజీవంగా ఉంచేవారు. అయితే భారతదేశం మొత్తం సరికొత్త పరిపాలన కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కూడా తెలంగాణలో బలపడేందుకు, బలమైన నాయకులను తయారుచేసేందుకు ఇదే మంచి సందర్భమని, యువతను ప్రోత్సహించి తరుచుగా పర్యటనలు చేయాలని నిర్ణయించుకుంది. త్వరలోనే పార్టీకి పునర్వైభవం కోసం తెలంగాణలో నాయకత్వాన్నిమార్చే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు.












Click it and Unblock the Notifications