సీఎం విజయ్ ఓ మెట్టు ఎక్కేశాడు- ఆ మాటతో..: అదరగొట్టిన ఫస్ట్ స్పీచ్
తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీ జోసెఫ్ విజయ్ పేరుతో ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఏఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతో ఇక్కడ ప్రభుత్వం కొలువుదీరింది.
అనంతరం ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావించారు. పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. హామీ ఇచ్చిన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా రక్షణ దళం, అన్ని జిల్లాల్లో మాదకద్రవ్యాల నిరోధక దళం ఏర్పాటుకు సంబంధించినవి వీటిల్లో ఉన్నాయి.

ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా మాట్లాడిన సీఎం విజయ్.. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు తమిళనాడు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అపారమైన ప్రేమ, మద్దతే తనను ఈ పదవికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మహిళా సంరక్షణకు, మద్యపాన నిషేధానికి, మత సామరస్యాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నూతన ప్రారంభం కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
లౌకిక సామాజిక న్యాయానికి ఒక నూతన శకం ఇప్పుడు మొదలవుతుందని విజయ్ తేల్చి చెప్పారు. తాను రాజ కుటుంబం నుంచి రాలేదని, ఒక సాధారణ మనిషినేనని ప్రసంగంలో స్పష్టం చేశారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ గా ప్రమాణ స్వీకారం చేయ డానికి కారకులు అయ్యారని, ఓ సాధారణ జీవితాన్ని గడిపే మామూలు మనిషిని అని ఆయన పేర్కొన్నారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కుమారుడిగా, పేదరికం, ఆకలి అంటే ఏమిటో తనకు బాగా తెలుసని వివరించారు.
"నేను మీ కుటుంబం నుండి వచ్చిన మీలో ఒకడిని. ఆ సాధారణ జీవితమే నాకు నచ్చింది. ఇకపైనా అలాగే ఉంటా. మీరు కూడా నన్ను అలాగే చూడబట్టే సినిమా రంగంలో నాకు ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు" అని విజయ్ వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతగా రాజకీయాల్లోకి వచ్చానని, కోట్లాదిమంది తనను ప్రేమతో అంగీకరించారని ఆయన అన్నారు.
తప్పుడు వాగ్దానాలతో ప్రజలను ఎప్పటికీ మోసం చేయబోనని ప్రకటించారు విజయ్. సాధ్యమైనవి మాత్రమే చేస్తానని హామీ ఇచ్చారు. అసాధ్యంగా కనిపించేవి కూడా సాధించవచ్చా అని ప్రజలు ఆశ్చర్యపోవచ్చని, అది ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదని అన్నారు. "కోట్లాది మంది ప్రజలు నాకు అండగా నిలబడితే, ఏదైనా సాధించవచ్చని నేను నమ్ముతున్నాను. నాకు ఆ విశ్వాసం ఉంది.. అని విజయ్ స్పష్టం చేశారు. తన "వర్చువల్ వారియర్స్"కు కృతజ్ఞతలు తెలిపారాయన. "విజయ్ మామా"కు మద్దతు ఇచ్చిన తన యువ అభిమానులకు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పారు.












Click it and Unblock the Notifications