సంజీవయ్య పార్క్‌లో టవర్, 'కేసీఆర్ వెనుక మాఫియా'
హైదరాబాద్: హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ టవర్లు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భావిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో అతిపెద్ద భవన నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. నగరంలోనే ఎత్తైన భవన నిర్మాణం ఈ పార్కులో చేపట్టాలనుకుంటున్నారు. అయితే, సంజీవయ్య పార్కు యథాతథంగా కొనసాగిస్తూనే ఈ నిర్మాణం చేపట్టనున్నారని తెలుస్తోంది.
అంబరుపేటలోని బతుకమ్మ కుంటను కాపాడాలని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు చాలా రోజులుగా కోరుతున్నారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రిని కలిసి దీనిని కాపాడాలని కోరారు. దీని పైన కేసీార్ స్పందించారు. బతుకమ్మ కుంట కబ్జా పైన ఆరా తీశారు.
మహాత్మా జ్యోతిరావుపూలే ఆడిటోరియం కట్టేందుకు నిర్ణయించిన భూమిని కబ్జా కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన వివరాలు మొత్తం కావాలన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి కోర్టు వివాదాల్లో ఉందన్నారు.

వివాదాలు పరిష్కారమైతే మూడు నుండి నాలుగు లక్షల కోట్ల విలువైన భూములు లభ్యమవుతాయన్నారు. ఆక్రమించిన భూములను ప్రభుత్వం ఆదీనంలోకి తేవాలన్నారు. ఇందుకు ప్రభుత్వ న్యాయవాదులు కృషి చేయాలన్నారు. మరోవైపు, గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
గోదావరి ప్రవహించే జిల్లాల్లో పరివాహక ప్రాంతాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదులు రాష్ట్రంలోనే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయన్నారు. గత పాలకులు పుష్కరాలను ఆంధ్రలోనే నిర్వహించే వారని, తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. పుష్కరుడు ఆవహించే గోదావరి తెలంగాణలోనే ఎక్కువగా ఉంటుందన్నారు.
కేసీఆర్ పైన నాగం ఆగ్రహం
కేసీఆర్ పైన బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. జీవో నెంబర్.111 రద్దు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఆ జీవోను రద్దు చేస్తే ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్‌లు మరో హుస్సేన్ సాగర్‌లలా మారుతాయన్నారు. ఆకాశహర్మ్యాలను నిర్మిస్తామని చెబుతున్న కేసీఆర్ వెనుక రియల్ మాఫియా ఉందన్నారు. చెరువుల మరమ్మతు వెనుక పైపుల కంపెనీల హస్తం ఉందన్నారు.












Click it and Unblock the Notifications